ఉగ్రరూపం దాల్చిన శ్రీశైలం
Srisailam Dam: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న భారీ వర్షాల వల్ల కృష్ణానది జలకళను సంతరించుకుంది. వరదనీటితో పోటెత్తుతోంది. భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఫలితంగా తెలంగాణలోని అన్ని నీటి ప్రాజెక్టులు కూడా మహోగ్ర రూపాన్ని ధరించాయి. పొంగిపొర్లుతున్నాయి.
ఇందిరా ప్రియదర్శిని జూరాల, నిజాం సాగర్, పోచారం, శ్రీరామ్ సాగర్, మిడ్ మానేర్, కడెం, సింగూరు.. వంటి ప్రాజెక్టులు గరిష్ఠస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. వాటన్నింటి గేట్లను ఎత్తివేశారు జల వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు. వరద జలాలను దిగువకు వదిలివేస్తోన్నారు.

జూరాల ప్రాజెక్ట్ నుంచి దాదాపుగా రెండు లక్ష క్యూసెక్కులకు పైగా వరద జలాలు శ్రీశైలం రిజర్వాయర్ కు చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది. అన్ని గేట్లను ఎత్తివేశారు. వచ్చిన వరద జలాలను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు. ఫలితంగా కృష్ణమ్మ ఉగ్రరూపాన్ని సంతరించుకుంది. దిగువకు పరుగులు పెడుతోంది.
గేట్లను ఎత్తడం ద్వారా 3.19 లక్షల క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు విడుదల చేస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు వచ్చే ఇన్ ఫ్లో 2.54 లక్షల క్యూసెక్కులు ఉంటోంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. బుధవారం సాయంత్రానికి 883.10 అడుగుల వరకు నీటి నిల్వ రికార్డయింది.
కొద్దిరోజులుగా తెలంగాణ సహా మహారాష్ట్ర, కర్ణాటకల్లో కొద్దిరోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. దీని ప్రభావంతో అటు గోదావరి, ఇటు కృష్ణానదికి వరద పోటుకు గురయ్యాయి. భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. కృష్ణా ఉపనదులు ఘటప్రభ, మలప్రభ, భీమా, తుంగ, భద్ర సైతం పొంగిపొర్లుతున్నాయి.
ఫలితంగా కృష్ణానది ఉరకలేస్తోంది. కర్ణాటకలో దీనిపై నిర్మించిన ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఆలమట్టి, నారాయణ్ పూర్ ప్రాజెక్టులు గరిష్ఠ నీటి మట్టానికి చేరుకున్నాయి. ఇటీవలే వాటి గేట్లను ఎత్తివేశారు కర్ణాటక జలవనరుల అధికారులు. లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
భారీ వర్షాలు మరో రెండు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందంటూ ఇప్పటికే భారత వాతావరణ కేంద్రం సూచించింది. దీంతో వరద తీవ్రత మరింత పెరుగుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల నుంచి అవుట్ ఫ్లో మరింత అధికంగా ఉండొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications