శ్రీశైలంలో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్.. కారణం ఇదే..!
పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీశైలంలో తీవ్ర విషాదం జరిగింది. ఆలయ పరిసరాల్లోని వడ్డెర సత్రంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు బలవన్మరణానికి పాల్పడ్డారు. సత్రంలోని రూమ్ నెంబర్ 11 లో ఫ్యాన్ కు ఉరి వేసుకుని ఇద్దరు పురుషులు.. అలాగే బాత్ రూమ్ డోర్లకు ఉరివేసుకుని ముగ్గురు మహిళలు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే గది నుంచి దుర్వాసన రావడంతో అక్కడి సిబ్బంది వెళ్లి చూడగా ఐదుగురు మృతదేహాలు కనిపించాయి. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఏం జరిగిందంటే..?
సత్యసాయి జిల్లా బత్తలపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం గతనెల 28న ఓ ఆటోలో వచ్చి వడ్డెర సత్రంలో రూమ్ 11 ను తీసుకున్నారు. అప్పటినుంచి ప్రతిరోజూ సత్రంలో భోజనానికి రావడం బయట తిరగడం అలాగే ఆలయానికి వెళ్లి రావడం చేస్తున్నారు. అయితే గత మూడు రోజులుగా రూమ్ నుండి ఎవరు బయటకు రాకపోవడం పైగా దుర్వాసన రావడంతో సత్రం నిర్వాహకులు కిటికీలోనుంచి చూడగా ఉరివేసుకున్న దృశ్యాలు చూసి కంగుతిన్నారు. వెంటనే శ్రీశైలం పోలీసులకు సమాచారం ఇచ్చారు.
డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో తలుపులు తెరచి చూడగా బాత్రూమ్ లో ముగ్గురు మహిళలు,మెయిన్ రూమ్ లో ఫ్యాన్ కు ఇద్దరు పురుషులు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల వివరాలు సుధాకర్(36), గోగుల ఆదిలక్ష్మి(50), మల్లేశ్వరి(45), శ్రీదేవి(33), మణికంఠ(15)గా గుర్తించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ముగ్గురు అక్కలలో ఇద్దరు అక్కలకు పెళ్లిళ్లు అయి భర్తలు వదిలేయడం.. ఒక అక్కకు పెళ్లి చేయకపోవడం.. అలాగే తీవ్ర అప్పులు కావడంతో ఓ అక్క కొడుకుతో సహా మొత్తం 5 మంది శ్రీశైలం వచ్చి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసుల ద్వారా సమాచారం తెలుస్తోంది.

ఇక బత్తలపల్లిలోని టీచర్స్ కాలనీకి చెందిన సుధాకర్ బత్తలపల్లిలో ఆటో యూనియన్ నాయకుడిగా ఉంటూ ఆటో నడిపేవాడని స్థానికులు చెబుతున్నారు. నెల రోజుల కిందట ఆర్థిక లావాదేవీల కారణంగా కుటుంబం బత్తలపల్లిని వదిలి వెళ్లారని తెలుస్తోంది. అలాగే సుధాకర్ రూ. కోటి వరకు అప్పులు చేసి ఐపీ పెట్టినట్లు సమాచారం. అప్పుల బాధ, అనారోగ్య సమస్యలతోనే సుధాకర్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్లు స్పష్టం అవుతోంది.












Click it and Unblock the Notifications