ఏపీలో నేడు, రేపు దంచికొట్టనున్న వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దక్షిణ కోస్తాంధ్ర, దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తులో బలమైన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయి.
కోస్తాంధ్ర, యానాం పరిధిలో ఆది, సోమవారాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చు. తీర ప్రాంతాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఒకటి రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ జల్లులు పడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి.ఆదివారం నేడు అనకాపల్లి, కాకినాడ, కోనసీమ మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది.

రాయలసీమలోనూ ఆదివారం అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమవారం నాటికి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. గాలులు, వర్షాల కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు, లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
చేపల వేటకు వెళ్లే వారు, సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వారు కూడా జాగ్రత్తలు పాటించాలి. రోడ్లపై ప్రయాణించేవారు జాగ్రత్తగా వాహనాలు నడపాలి. ప్రస్తుతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం మొదలయ్యే సమయం కావడంతో రాష్ట్రంలో వాతావరణం మారుతూ ఉంటుంది. అధికారుల సూచనలు పాటించి అనవసరమైన ప్రయాణాలు నివారించడం మంచిది.
ఇదిలా ఉంటే మళ్ళీ అక్టోబర్ 12న ఉత్తర అండమాన్ సముద్రంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉన్నందున, దాని ప్రభావంతో అక్టోబర్ 13 నాటికి అండమాన్ సముద్రంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది. ఫలితంగా అక్టోబర్ మాసంలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.













Click it and Unblock the Notifications
