శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు, దర్శనాల్లో మార్పులు..భక్తులకు కీలక సూచనలు..!!
కార్తీక మాసం ఆరంభం వేళ శ్రీశైలంలో భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు నుంచి నవంబర్ 21 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. కార్తీకమాసం మొత్తం శ్రీస్వామివారి గర్భాలయ, సామూహిక అభిషేకాలు నిలుపుదల చేశారు ఆలయ అధికారులు. శని, ఆది, సోమ, ప్రభుత్వ సెలవులు, కార్తీక పౌర్ణమి రోజులలో స్పర్శ దర్శనాలను రద్దు చేశారు. ఇదే సమయంలో శ్రీశైలం వచ్చే భక్తులకు కీలక సూచనలు చేసారు.
శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కార్తీక మాసంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు రద్దు చేసినట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. కార్తీక మాసం ప్రారంభం కావటంతో శ్రీశైలం ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. నేటి (బుధవారం) నుంచి సాధారణ రోజులలో మూడు విడతలుగా శ్రీస్వామివారి స్పర్శ దర్శనాలకు భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

నవంబర్ 14న శ్రీశైలంలో మొదటిసారిగా కోటి దీపోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈనెల 31న కృష్ణమ్మకు నదీహారతి, నవంబర్ 5న కార్తీక పౌర్ణమి జ్వాలాతోరణం నిర్వహిస్తామన్నారు. కార్తీక దీపారాధనకు ఆలయ ఉత్తర మాడ వీధిలో గంగాధర మండపం వద్ద భక్తులకు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అదే విధంగా ప్రతి రోజూ విడతలవారీగా మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనం ఉంటుందని, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు నిలుపుదల చేయనున్నట్లు శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు. అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలు నిలుపుదల చేసారు. కాగా, యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు.
ఇదే సమయంలో మహానంది, యాగంటి, కాల్వబుగ్గ, ఓంకారం క్షేత్రాల్లో కార్తిక మాసోస్తవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆయా పుణ్యక్షేత్రాలకు భక్తుల రద్దీ కూడా పెరిగింది. శ్రీశైలం పాతాళ గంగలో భక్తులు పుణ్య స్నానాలు చేసి దీపాలు వెలిగిస్తున్నారు. అటు ఏపీఎస్ ఆర్టీసీ తో పాటుగా టూరిజం శాఖ శ్రీశైలంకు పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసారు. పుణ్యక్షేత్రల సందర్శన కోసం ప్యాకేజీలు ప్రకటించారు.












Click it and Unblock the Notifications