బ్రహ్మోత్సవాల వేళ తిరుమలలో ఇబ్బందులు పడ్డ భక్తులు
Heavy rain in Tirumala: కలియుగ వైకుంఠంలా అలరారుతున్న తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజైన శనివారం ఉదయం శ్రీమలయప్ప స్వామివారు మురళీ కృష్ణుడి అవతారంలో అశేష భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఏనుగులు, అశ్వాలు, భక్తుల కోలాటాలు, మంగళ వాయిద్యాలు, ఇతర కళా ప్రదర్శనల మధ్య మలయప్ప స్వామివారు- అయిదు తలల చిన్నశేష వాహనంపై ఊరేగారు. లక్షలాదిమంది భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని గోవిందుడి నామస్మరణతో శేషాచలం కొండలు మారుమోగిపోతోన్నాయి.

చిన్నశేషుడిని వాసుకిగా కొలుస్తారు భక్తులు. శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం శ్రీమన్నారాయణుడిని శేషిగా, ఈ సమస్త భూ ప్రపంచాన్ని శేషభూతంగా పూజిస్తారు. ఈ శేషిభావానికి సూచికగా శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో మలయప్ప స్వామివారిని చిన్న శేషవాహనంపై ఊరేగించడం ఆనవాయితీగా వస్తోంది.
చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే కుటుంబ శ్రేయస్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కాగా- బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ సాయంత్రం 7 నుంచి 9 గంటల వరకు మలయప్ప స్వామివారు హంస వాహనంపై ఊరేగనున్నారు. భక్తులను కటాక్షించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి.
కాగా- వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న సమయంలో తిరుమలలో అతి భారీ వర్షం కురిసింది. ఈ మధ్యాహ్నం నుంచి గంటన్నర పాటు ఏకధాటిగా దంచికొట్టింది. కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. భక్తులు తమ గదులకే పరిమితం అయ్యారు.
మధ్యాహ్నం వరకు ఎండ కనిపించినప్పటికీ ఆ తరువాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతం అయింది. ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. శ్రీవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచింది. అప్పటివరకు భక్తులతో సందడిగా ఉన్న తిరుమల ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. భక్తులు వసతి గదులు, కాటేజీలకు పరిమితం అయ్యారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేశాయి. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తేలికపాటి వర్షం పడింది.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ప్రకాశం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి, కడప, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షపాతం నమోదైంది.












Click it and Unblock the Notifications