అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో టీ నోట్, వెనక్కి తగ్గం: దిగ్విజయ్
న్యూఢిల్లీ: తెలంగాణపై చేసిన నిర్ణయాన్ని తాము వెనక్కి తీసుకునే ప్రసక్తి లేదని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. అందరితో చర్చించిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ప్రాంతీయ పార్టీల మాదిరిగా తాము నిర్ణయాలను మార్చుకోబోమని అన్నారు.
అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ నోట్ మంత్రి వర్గం ముందుకు వస్తుందని ఆయన చెప్పారు. తెలంగాణ బిల్లు దశలో ఆంటోనీ కమిటీతో చర్చిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సీమాంధ్ర పక్షపాతి అంటూ వచ్చిన ఆరోపణలపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఏ సందర్భంలో ఏం మాట్లాడారో తెలియదని ఆయన అన్నారు.

కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడిన విషయాలపై పూర్తి వివరాలు అందుకున్న తర్వాతనే మాట్లాడుతానని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి రెండు ప్రాంతాలకు ముఖ్యమంత్రి అని, రాష్ట్రం విడిపోయే వరకు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని ఆయన అన్నారు.
ఇదిలావుంటే, సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి పళ్లంరాజు గురువారంనాడు కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీని కలుసుకున్నారు. ఆయన దాదాపు 20 నిమిషాలపాటు సోనియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనను ఆపాలని ఆయన సోనియాను కోరినట్లు తెలుస్తోంది. అయితే, సోనియాతో బేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
అదే సమయంలో రాయలసీమకు చెందిన రాష్ట్ర మంత్రి టిజి వెంకటేష్ దిగ్విజయ్ సింగ్‌ను కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిన అవసరాన్ని ఆయన దిగ్విజయ్ సింగ్‌తో చెప్పినట్లు సమాచారం. అయితే, తమ వాదనలను పట్టించుకోకుండా రాష్ట్ర విభజనకే పార్టీ అధిష్టానం అడుగులు ముందుకు వేస్తుండడం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ బెయిల్‌పై కాంగ్రెసు అధిష్టానంతో ఒప్పందంతోనే విడుదలయ్యారనే వార్తలు గుప్పుమనడం సీమాంధ్ర కాంగ్రెసు నాయకులను కలవరపెడుతోంది.
జగన్ సహాయంతో కాంగ్రెసు అధిష్టానం శానససభలో తెలంగాణ తీర్మానాన్ని నెగ్గించుకోవాలని ఎత్తులు వేసిందని, అలాగే సీమాంధ్రలో తమతో పని లేకుండా జగన్‌తో ఒప్పందు చేసుకుని ఎన్నికల తర్వాత తమను సమర్థించేలా చూసుకోవడానికి వ్యూహ రచన చేసిందని సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు భావిస్తున్నారు. దీంతో సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు, నాయకులు గురువారంనాడు లగడపాటి రాజగోపాల్ నివాసంలో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications