అమరావతికి ఉద్యోగుల తరలింపులో మరో మలుపు: కేసీఆర్‌కు చిక్కు!
హైదరాబాద్/అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియ పలు మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే కొందరు ఏపీ ఉద్యోగులు వెళ్లేందుకు, మరికొందరు సదుపాయల కోసం అడుగుతున్నారు. తాజాగా ఆంధ్రాకు కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల అంశం తెరపైకి వచ్చింది.
ఈ నెల 27 నుంచి ఏపీ నుంచే పాలన అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలతో ఏపీకి కేటాయించిన తెలంగాణ ఉద్యోగుల్లో అలజడి రేగుతోంది. అటు ఏపీకి వెళ్లలేని పరిస్థితుల్లో ఉన్న తమను తెలంగాణ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మరో చిక్కు.
ఉమ్మడి రాష్ట్రంలోని ఉద్యోగులను ఇరు రాష్ట్రాలకు 58:42 నిష్పత్తిలో కమలనాథన్ కమిటీ విభజించింది. తెలంగాణలో అధికంగా ఉన్న రెండువేల మందికి పైగా క్లాస్ 4, డ్రైవర్, రికార్డు అసిస్టెంట్ ఉద్యోగులను ఏపీకి కేటాయించింది. ఈ విభజనపై తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు.

ఈ ఉద్యోగులందరినీ తిరిగి తెలంగాణకు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. అటు ఏపీకి కేటాయించిన ఉద్యోగులు కూడా తాము ఏపీలో విధులు నిర్వహించలేమని తెలంగాణ సీఎస్‌కు మొరపెట్టుకుంటున్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం కోరితే వారిని తెలంగాణకు రిలీవ్ చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉంది.
ఏపీ సచివాలయంలో 265 మంది ఉద్యోగులు, హెచ్‌వోడీలు ఇతర సంస్థల్లో 1850మంది తెలంగాణ ఉద్యోగులు ఏపీ ప్రభుత్వ పరిధిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏపీ కార్యాలయాలన్నీ విజయవాడకు తరలి వెళ్తే తమ పరిస్థితి ఏమిటని తెలంగాణ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
బుధవారం భోజన విరామ సమయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. తెలంగాణ ఉద్యోగులు వచ్చినా తమకు అభ్యంతరం లేదని ఏపీ చెబుతోంది. కానీ వెళ్లేందుకు తెలంగాణ ఉద్యోగులు సిద్ధంగా లేరు. తెలంగాణ ప్రభుత్వం తమను పట్టించుకోకుంటే ఉద్యమిస్తామని ఏపీకి కేటాయించబడిన తెలంగాణ ఉద్యోగులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications