క్రమశిక్షణ పేరుతో 200 గుంజీలు తీయించిన ప్రిన్సిపల్.. అస్వస్థతకు గురైన విద్యార్ధినులు...
క్రమశిక్షణ పేరుతో ఓ ప్రిన్సిపల్ విద్యార్థునులతో 200 గుంజీలు తీయించింది. దాంతో ఆ కళాశాలలోని 50 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గురువులు అంటే విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేర్చేలా వారిని ప్రోత్సహించాలి. కానీ, ప్రస్తుతం చాలా చోట్ల గురువులు విద్యార్థుల పట్ల దారుణాలకు తెగబడుతున్నారు. వారి దాష్టికానికి కొంతమంది విద్యార్థులు జీవితాలు కోల్పోతున్న సంఘటనలు ఇటీవల చాలా చూస్తున్నాం. తాజాగా ఇలాంటి ఘటనే ఏపీలో చోటుచేసుకుంది.
ఓ ప్రిన్సిపల్ చేసిన దారుణానికి ఆ కళాశాలలోని బాలికలు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు.
రాష్ట్రంలోని అల్లూరి జిల్లా రంపచోడవరంలోని ఏపీఆర్ బాలికల జూనియర్ కళాశాలలో ఓ అమానవీయమైన సంఘటన జరిగింది. మాట వినడం లేదని విద్యార్థులను అక్కడి ప్రిన్సిపల్ సుమారు మూడురోజులు పాటు వంద నుంచి రెండువందల గుంజీలు తీయించింది. దీంతో ఆ బాలికల పరిస్థితి తీవ్రంగా మారింది. కళాశాలలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినులు చెప్పిన మాట వినడం లేదని, క్రమశిక్షణ పేరుతో కళాశాల ప్రిన్సిపల్ ప్రసూన, పీడీ కృష్ణకుమారి విద్యార్థినులతో 200 గుంజీలు తీయించారు.

ఇదే పరిస్థితిని సోమవారం కూడా కొనసాగించడంతో కొంతమంది విద్యార్థినుల పరిస్థితి దారుణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కొంతమంది ఈ విషయాన్ని విద్యార్థునుల తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే కళాశాలకు చేరుకుని విద్యార్థినులను స్థానిక ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అందులో కొంతమంది విద్యార్థునులు సాయంత్రానికి కోలుకోవడంతో ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ చేశారు.

స్పందించిన ఎమ్మెల్యే..
క్రమశిక్షణ పేరుతో ఆడపిల్లలు అని కూడా చూడకుండా ఇంత అమానుషంగా ప్రవర్తించిన కళాశాల ప్రిన్సిపల్, పీడీలపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టాలని ఐటీడీఏ పీఓ కట్టా సింహాచలాన్ని ఆదేశించారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలికలను శిరీషా దేవి బాలికలను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications