'నారాయణ' కాలేజీలో విద్యార్థుల ఆగ్రహం, ఫర్నీచర్ ధ్వంసం?
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని నారాయణ జూనియర్ కళాశాలలో సోమవారం అర్ధరాత్రి విద్యార్థులు బీభత్సం సృష్టించినట్లుగా తెలుస్తోందని సాక్షి మీడియాలో వచ్చింది. కళాశాల నిర్వాహకుల నిర్వాకాన్ని నిరసిస్తూ ఆస్తులు ధ్వంసం చేశారని వార్తలు వస్తున్నాయి.
కళాశాలలో వెయ్యికి పైగా విద్యార్థులు ఉన్నారు. కొంతకాలంగా కళాశాలలో సౌకర్యాల కొరత పైన విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. సరైన భోజన వసతి కల్పించడం లేదని ఆరోపిస్తున్నారట.
మంగళవారం పరీక్షలు ముగిసిన అనంతరం.. జూనియర్లు, సీనియర్ల మధ్య వాగ్వాదం జరిగిందని తెలుస్తోంది. అనంతరం విద్యార్థులు కళాశాల అడ్మిన్ భవనంలోని ఫర్నీచర్, ఏసీ మిషన్లు, ఫ్యాన్లు, గదుల పైకప్పు సీలింగ్‌ను ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. వీధిలైట్లు పగులగొట్టారు.

కళాశాల నిర్వాహకుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు వచ్చారు. పరిస్థితిని చక్కబెట్టే ప్రయత్నం చేశారు. పోలీసులు పరిస్థితిని సమీక్షించారు. కాగా, జరిగిన సంఘటన బయటకు పొక్కకుండా యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
మరోవైపు, కళాశాలలో ఎటువంటి సంఘటన జరగలేదని ఏజీఎం పద్మారెడ్డి విలేకరులతో చెప్పారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల సాయం కోరినట్లు తెలిపారు. కళాశాల నిర్వహణలో అప్రమత్తంగా ఉన్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications