మోసం చేయడం వేరు, బాకీ వేరు: బ్యాంక్ కేసుపై సుజనా
హైదరాబాద్: మారిషస్ బ్యాంకు నుంచి తాను ఏ విధమైన రుణం కూడా తీసుకోలేదని, వేరే కంపెనీకి తమ కంపెనీ హామీదారుగా మాత్రమే ఉందని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నాయకుడు సుజనాచౌదరి తెలిపారు. మారిషస్ బ్యాంకు కేసుకు సంబంధించి నాంపల్లి కోర్టు తనపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌పై ఆయన స్పందించారు.
ఈ కేసు విచారణకు తమ కంపెనీ డైరెక్టర్లు హాజరవుతూనే ఉన్నారని, న్యాయవాది సలహా మేరకు తాను వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరినట్లు తెలిపారు. మారిషస్ బ్యాంకుకు తాను వ్యక్తిగతంగా హామీ ఇవ్వలేదని, సంస్థ తరఫున మాత్రమే హామీ ఇచ్చామని ఆయన చెప్పారు.

తాను సుజనా గ్రూప్ వ్యవస్థాపకుడిని మాత్రమేనని, తర్వాత సంస్థలో చాలా మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. రుణం తీసుకున్న కంపెనీలో తనకు ఒక్క శాతంలోపే వాటా ఉందన్నారు. మోసం చేయడం వేరు, బ్యాంకులకు బకాయి ఉండటం వేరని దీన్ని మీడియా అర్థం చేసుకోవాలని అన్నారు.
మారిషన్ బ్యాంకు కేసుకు సంబంధించి సుజనాచౌదరిపై నాంపల్లి కోర్టు గురువారం అరెస్ట్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణకు ఆయన మూడుసార్లు నుంచి హాజరుకానందుకు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయన్ని అరెస్ట్ చేసి ఈనెల 26న జరిగే తదుపరి విచారణకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది.












Click it and Unblock the Notifications