ప్యాకేజీ క్రెడిట్: సుజనా వర్సెస్ అశోక్ గజపతి, ఎప్పుడూ దూరం పెట్టలేదు
అమరావతి: ఏపీకి కేంద్రం ప్యాకేజీ ప్రకటించే సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజుని దూరంగా పెట్టినట్టు వస్తున్న వార్తలపై మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి స్పందించారు. ఏపీకి కేంద్రం సాయం ప్రకటించే సమయంలో అన్నీ తానై సుజనా చౌదరి వ్యవహిరించిన సంగతి తెలిసిందే.

తెలుగుదేశం పార్టీ నుంచి కేంద్రం ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు ఉన్నప్పటికీ సాయం ప్రకటన విషయంలో జరిగిన చర్చల్లో సుజనా చౌదరి చురుగ్గా పాల్గొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు కేంద్రం ప్యాకేజీపై తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఢిల్లీ నుంచి చంద్రబాబుకు ఫోన్‌లో సమాచారాన్ని అందించారు.
ఈ సందర్భంలో ప్యాకేజీ ప్రకటనలో విషయంలో అశోక్ గజపతి రాజుని దూరంగా పెట్టారని వస్తున్న వార్తలపై ఆయన సోమవారం ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక సాయంపై చర్చలు జరిగినప్పుడు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఢిల్లీలో లేరని, అందుకే ఆయన ఈ చర్చల్లో పాల్గొనలేదని వివరించారు.
అంతే తప్ప, తానెప్పుడూ ఆయన్ని దూరంగా పెట్టలేదని అన్నారు. అశోక్ గజపతిరాజు అంటే తన కెంతో గౌరవమని అన్నారు. ఏపీకి ప్రత్యేక సాయం చర్చల్లో గజపతిరాజుని దూరంగా పెట్టారనే వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని అన్నారు. ఆయన సీనియర్ మంత్రి, అందరూ గౌరవిస్తారని అన్నారు.
ఏపీకి కేంద్రం ప్రకటించిన సాయంపై అశోక్ గజపతిరాజు కూడా చాలా ప్రయత్నాలు చేశారని అన్నారు. గత రెండేళ్లుగా ఆయన పలు మీటింగ్‌లలో పాల్గొరని అన్నారు.
రాజమండ్రి సభలో అశోక్ గజపతి రాజు చమత్కారం
కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు ఆసక్తికర వ్యాఖ్యతో ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎయిర్ పోర్టు విస్తరణ శంకుస్థాపన పనులు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులా ఛలోక్తులు విసురుతూ, ఆకట్టుకునేలా తాను మాట్లాడలేనని అన్నారు.
ఆయన కానీ మహా కవి గురజాడ చెప్పినట్లు 'వట్టి మాటలు కట్టి పెట్టి, గట్టి మేల్ తల పెట్టవోయ్' అన్నట్లుగా వట్టి మాటలు కట్టిపెట్టి రాష్ట్ర ప్రజలకు గట్టి మేలు తలపెడతున్నానని అన్నారు. సాధారణంగా పెద్దగా మాట్లాడని అశోక్ గజపతిరాజు చమత్కరించేసరికి సభికులు నవ్వేశారు.












Click it and Unblock the Notifications