జగన్ హోదాకు ఎసరు: సుజయకృష్ణనే చంద్రబాబు అస్త్రం?
హైదరాబాద్: విజయనగరం జిల్లా బొబ్బిలి శాసనసభ్యుడు సుజయకృష్ణ రంగారావును వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నట్లు తెలుస్తోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాకు ఎసరు పెట్టడానికి సుజయకృష్ణ రంగారావును ఆయన అస్త్రంగా వాడనున్నట్లు సమాచారం.
ఇప్పటి వరకు 13 మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు టిడిపిలో చేరారు. మరికొంతమంది శాసనసభ్యులు టిడిపిలో చేరడానికి సిద్ధపడ్డారు. వైసిపి ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా సీటుకు ఎసరు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సిద్ధమవుతున్నారు.
మొత్తం 37మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి వస్తే జగన్ ప్రతిపక్ష హోదాకు గండి పడే అవకాశం ఉంటుంది. 37 మంది వచ్చిన తర్వాత వారంతా కలిసి జగన్ స్థానంలో జ్యోతుల నెహ్రును వైసీపీఎల్పీ నేతగా ఎన్నుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే, ఈ వ్యవహారం సాంకేతికంగా జరగడానికి, ఎక్కడా విమర్శలు రాకుండా చూసుకోవడానికి టిడిపి నాయకత్వం వ్యూహం రచించింది.

అందులో భాగంగానే వైసీపీఎల్పీ కార్యదర్శిగా ఉన్న సుజయకృష్ణ రంగారావును ముందుగా టిడిపిలో చేర్చుకుంది. వ్యవహారమంతా ఆయనతోనే నడిపించేందుకు సాంకేతిక సన్నహాలు చేస్తున్నారు. సుజయకృష్ణ రంగా రావు వైసీపీఎల్పీ కార్యద ర్శి హోదాలో స్పీకర్‌కు లేఖ రాయనున్నారు. తాము అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో వైసీపీఎల్పీ సమావేశం నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వాలని లేఖ రాస్తారు.
అప్పుడు అది అధికారిక సమావేశంగా నమోదవుతుంది. ఆ తర్వాత 37మంది సంతకాలు తీసుకుని, తాము వైసీపీఎల్పీ నేతగా జ్యోతుల నెహ్రును ఎన్నుకున్నామని స్పీకర్‌కు లేఖ రాస్తారు. తర్వాత స్పీకర్ ఆ లేఖను పరిగణనలోకి తీసుకుని జ్యోతుల నెహ్రును విపక్ష నేతగా గుర్తిస్తున్నట్లు ప్రకటిస్తారు.
వైసిపి శాసనసభా పక్ష కార్యదర్శిగా ఉన్నందున అంతా సుజయకృష్ణ రంగారావు చేతుల మీదుగానే నడిపిస్తే తర్వాత జగన్ కోర్టుకు వెళ్లినా ఎలాంటి ఇబ్బందులు ఉండవని టిడిపి భావిస్తోంది. సుజయకృష్ణ రంగారావు టిడిపిలో చేరినప్పటికీ ఆయన స్థానంలో కార్యదర్శిగా జగన్ మరొకరిని నియమించకపోవడం ఇక్కడ కొసమెరుపు.












Click it and Unblock the Notifications