రాజకీయాల్లోకి వస్తా.. ఆ పార్టీకే మద్దతు: సుమన్
త్వరలోనే రాజకీయరంగ ప్రవేశం చేయబోతున్నట్లు నటుడు సుమన్ వెల్లడించారు. తెలంగాణలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి పార్టీకి తన మద్దతు తెలియజేస్తానన్నారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం కోమటితిప్పలో జరిగిన ఓ కార్యక్రమానికి సుమన్ హాజరయ్యారు. కాపునాడు నియోజకవర్గ అధ్యక్షుడు సత్తినేని శ్రీనివాస తాతాజీ ఇంటి దగ్గర ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతి ఏడాది వర్షాలు కురుస్తుంటాయని, అలాగే విపత్తులు కూడా వస్తుంటాయని, ప్రభుత్వాలే ఆ దిశగా ముందస్తు చర్యలు తీసుకుంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులు కోరేది కొంచెమేనని, ఏ ప్రభుత్వమైన వారి సమస్యల పరిష్కారానికి ముందుకు రావాలన్నారు.

ఇటీవలే వైసీపీ నాయకులు రజనీకాంత్ పై చేస్తున్న వ్యాఖ్యలకు సుమన్ స్పందించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన రజనీకాంత్ చంద్రబాబునాయుడిపై ప్రశంసలు గుప్పించారు. దీనికి వ్యతిరేకంగా ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు రజనీకాంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆ సమయంలో రజనీకాంత్ చేసిన ప్రసంగంలో తప్పు పట్టడానికి ఏమీ లేదని, చంద్రబాబు గురించి ఆయన చెప్పిన మాటలు నిజమేనని సుమన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు హైదరాబాద్ కు ఒక రూపం తీసుకొచ్చారని, ఈరోజున శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతోపాటు ఐటీరంగం, ఇతర రంగాలన్నీ అభివృద్ధి చెందాయంటే అందుకు ఆయన వేసిన పునాదే అని సుమన్ చెప్పారు.
రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజంగా ఉంటుంటాయని, ఒకరు వస్తుంటే మరొకరు వెళుతుంటారన్నారు. చంద్రబాబు మంచి ముఖ్యమంత్రి అని, ప్రజలు మార్పు కోరుతుంటారని, అలా అని ఆయన చేసింది చేయలేదు అని చెప్పలేమన్నారు. రజనీకాంత్ తన ప్రసంగంలో.. ఇటీవల హైదరాబాద్ వెళితే న్యాయార్క్ వెళ్లామా? అనిపించిందని కొనియాడారు. రజనీకాంత్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. హైదరాబాద్ ను భారత రాష్ట్ర సమితి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications