తిరుమలలో సుప్రభాతం-మేల్కొలుపు సేవ పునరుద్ధరణ
Tirumala: ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్లు/టికెట్లు ఉన్న భక్తులు తిరుమలకు బారులు తీరుతున్నారు. శ్రీవేంకటేశ్వర స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి వేలసంఖ్యలో తరలి వస్తోన్నారు.
సోమవారం నాడు 74,800 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 17,726 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.48 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది. భక్తులకు టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి సుప్రభాత సేవను టీటీడీ అధికారులు పునరుద్ధరించారు. నేటి నుంచి మళ్లీ సుప్రభాతంతో శ్రీవారి సేవలు ఆరంభం అయ్యాయి. దీనితో దాదాపుగా నెల రోజుల తరువాత సుప్రభాత సేవ తిరుమల శ్రీవారి ఆలయంలో తిరిగి ఆరంభమైనట్టయింది.
ధనుర్మాసారంభం నేపథ్యంలో కిందటి నెల 17వ తేదీన సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలను కొనసాగించిన విషయం తెలిసిందే. శ్రీవారి మాసోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యత ఉండటం వల్ల ధనుర్మాసంలో స్వామివారికి తిరుప్పావై పాశురాలతో నివేదించారు. ఆ ఘడియలు ముగియడంతో యధాతథంగా సుప్రభాత సేవను పునరుద్ధరించారు.
ధనుర్మాసంలో ఈ నెల రోజులపాటు తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదించారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహించారు. శ్రీవారికి విశేష కైంకర్యాలతో పూజాదికాలను పూర్తి చేశారు.
బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేశారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరించారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోసె, బెల్లం దోసె, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలతో పూజించారు.
ధనుర్మాసం ముగిసిన నేపథ్యంలో ఈ సాయంత్రం తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం గ్రౌండ్స్‌లో గోదా కల్యాణం జరగనుంది. సాయంత్రం 6:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.
శ్రీకృష్ణస్వామి, శ్రీ ఆండాళ్ అమ్మవారి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరిస్తారు. అనంతరం అర్చకులు వేడుకగా కల్యాణం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఎస్వీ సంగీత కళాశాల, అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో భక్తి సంగీత కార్యక్రమాలతో ముగుస్తుంది.












Click it and Unblock the Notifications