మూడు రాజధానుల కేసు - సుప్రీంకోర్టు తాజా నిర్ణయం..!!
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం న్యాయపరంగా కీలక అడుగులు పడుతున్నాయి. అమరావతి రాజధానిగా కొనసాగింపు - జగన్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం నేపథ్యంలో న్యాయ పరంగా దీనిని తేల్చేందుకు సుప్రీంకోర్టు సంసిద్దత వ్యక్తం చేసింది. దీనికి సంబంధించిన పిటీషన్ల విచారణకు ముహూర్తం ఖరారైంది. మూడు రాజధానులపై దాఖలైన పిటిషన్లపై వచ్చే నెల ఒకటో తేదీన విచారణ జరపాలని సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని కొట్టివేస్తూ ఈ ఏడాది మార్చి 3న ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలంటూ తీర్పులో స్పష్టం చేసింది. ఏపీ అసెంబ్లీకి రాజధాని మార్చే అధికారం లేదని తీర్పులో పేర్కొంది.
అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సమయం నిర్దేశించింది. దీని పైన ప్రభుత్వం అనేక రకాలు చర్చించి నిర్ణయం తీసుకుంది. అమరావతి రైతుల పాదయాత్ర అరసవల్లి వరకు ప్రారంభం కావటంతో మూడు రాజధానుల అంశం పైన మరోసారి అసెంబ్లీలో చర్చ చేసింది. ఆ తరువాత హైకోర్టు తీర్పును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్సెషల్ లీవ్ పిటీషన్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ ను పరిశీలించిన సుప్రీంకోర్టు నెంబర్ కేటాయించింది. తాజాగా ఈ కేసును త్వరగా విచారణ ప్రారంభించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టును అభ్యర్దించారు.

ఇదే సమయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడంలేదని, అమలు చేయించేలా ఆదేశాలివ్వాలంటూ రాజధాని రైతు పరిరక్షణ సమితి పిటిషన్లను దాఖలు చేసింది. అన్ని పిటిషన్లను ఒకేరోజు విచారించాలని సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంది. అయితే, రైతు పరిరక్షణ సమితి దాఖలు చేసిన పిటిషన్‌ను నవంబరు ఒకటిన విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ ధర్మాసనం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా తాము దాఖలు చేసిన పిటిషన్‌కు కూడా అత్యవసరంగా విచారించాలని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు లేఖ రాయడంతో, దానినీ అదే రోజు విచారించడానికి అంగీకరించింది.
హైకోర్టు ఇచ్చిన తీర్పులో శాసనసభకు రాజధానుల పైన నిర్ణయాధికారం లేదని చెప్పటం పైన ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. అదే విధంగా రాష్ట్రంలో మూడు రాజధానుల ద్వారా పరిపాలనా వికేంద్రీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వివరించారు. ఇప్పుడు మూడు రాజధానుల అంశం రాజకీయంగా కీలకంగా మారటంతో.. సుప్రీం కోర్టు విచారణ ఉత్కంఠను పెంచుతోంది.












Click it and Unblock the Notifications