సీఎం జగన్ కు సుప్రీం బిగ్ రిలీఫ్ - రుషికొండ పిటీషన్ డిస్మిస్...!!
విశాఖ రుషికొండ నిర్మాణాల విషయంలో సుప్రీంకోర్టు స్పష్టత ఇచ్చింది. రుషికొండ నిర్మాణాలు చేపట్టవద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని లింగమనేని సుప్రీంను ఆశ్రయించారు. దీనిని విచారించిన సుప్రీంకోర్టు ఈ పిటీషన్ ను డిస్మిస్ చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై.చంద్రచూడ్ స్పష్టం చేసారు. అక్కడ సీఎం వెళ్లవద్దా..క్యాంపు కార్యాలయాలు నిర్మించుకోవద్దా అంటూ వ్యాఖ్యానించారు. సుప్రీం రాజకీయాలకు వేదిక కాదంటూ చురకలు అంటించారు.
ముఖ్యమంత్రి జగన్ విశాఖ నుంచి పాలనకు సిద్దం అవుతున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ పైన నిర్మాణాల విషయంలో రాజకీయంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అక్కడ కొండను ఆక్రమించారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. అయితే, ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వం ఆక్రమించటం ఏంటని వైసీపీ నేతలు కౌంటర్ చేస్తున్నారు. ఇదే సమయంలో రుషికొండ నిర్మాణాల విషయంలో ఎన్టీజీ, హైకోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ కేసులు పరిష్కారం అయ్యే వరకూ ఋషి కొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని సుప్రీం కోర్టును ఆశ్రయించిన లింగమనేని శివరామ ప్రసాద్ విజ్ఞప్తి పైన విచారణ జరిగింది.

విచారణ సమయంలో సీజే బెంచ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇది రాజకీయ ఫిర్యాదుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అక్కడకు వెళ్లవద్దా అని ప్రశ్నించింది. ఏవైనా ఉంటే హైకోర్టుకు వెళ్లాలని సర్వన్నత న్యాయస్థానం సూచించింది. ఇదే సమయంలో ఇది రాజకీయ ఫిర్యాదుగా సీజేఐ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. అంతిమంగా రుషికొండ పై నిర్మాణాలు చేయోద్దన్న పిటీషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. అటు డిసెంబర్ నుంచి విశాఖ కేంద్రంగా పాలన ప్రారంభించేందుకు సీఎం జగన్ సిద్దం అవుతున్నారు. మంత్రులు తమ కార్యాలయాల ఏర్పాటులో నిమగ్నయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటానికి తిరస్కరించింది. ఇక, సుప్రీం నిర్ణయంతో ఈ వ్యవహారంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాలి.












Click it and Unblock the Notifications