ఆ టీడీపీ ఎంపీని అలా ఎలా వదిలేస్తారు ?-సుప్రీం కీలక ప్రశ్న..!
ఆయన ఏపీలో అధికార పార్టీ ఎంపీ. దేశాన్ని కుదిపేసిన ఓ కీలక స్కాంలో ఆయన కీలక సూత్రధారి అని దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ ఇప్పటికే తమ రిపోర్టుల్లో పేర్కొన్నాయి. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన పేరును మాత్రం ఈ కేసు ఛార్జిషీట్ లో నిందితుడిగా చేర్చలేదు. దీనిపై కీలక సమయంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఆయన్ను అలా ఎలా వదిలేస్తారని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ను నిలదీసింది. దీంతో ఈడీ ఇరుకునపడింది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సీఎం అరవింద్ కేజ్రివాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురిని సీబీఐ, ఈడీ నిందితులుగా చేర్చి దర్యాప్తు చేశాయి. అయితే ఈ స్కాంకు సంబంధించి ఢిల్లీలోని టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇల్లే కేంద్రంగా చర్చలు జరిగాయి. అయినా మాగుంటను మాత్రం ఈడీ, సీబీఐ ఎందుకో నిందితుడిగా చేర్చలేదు. ఇదే అంశాన్ని సీబీఐ ప్రశ్నించింది.

మాగుంట ఇంట్లో జరిగిన చర్చల్లోనే ఢిల్లీ లిక్కర్ స్కాంకు పథక రచన జరిగినట్లు పేర్కొన్న దర్యాప్తు సంస్థలు ఆయన్ను నిందితుడిగా చేర్చకుండా కేవలం సాక్షిగానే పరిగణించాయి. దీనిపై సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇదే కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కవితకు సమానంగా మాగుంట పాత్ర కూడా ఉండగా.. ఈడీ మాత్రం నిందితుడిగా చేర్చకుండా వదిలేయడంపై సుప్రీం ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అదే సమయంలో మాగుంట కుమారుడు రాఘవ్ ను తొలుత నిందితుడిగా చేర్చి ఆ తర్వాత అప్రూవర్ గా మార్చడంపైనా సుప్రీంకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది.
ఇదంతా చూస్తుంటే తమకు ఇష్టం లేని వారిని ప్రాసిక్యూషన్ నిందితులుగా చేర్చి, ఇష్టమున్న వారిని వదిలేసినట్లు కనిపిస్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాసిక్యూషన్ నిజాయితీగా వ్యవహరించాలని చీవాట్లు పెట్టింది. ఈ నేపథ్యంలో ఈడీ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications