ఒత్తిడిలో కేంద్రమంత్రి సుజనా చౌదరి: 100 కోట్లు చెల్లించాల్సిందే!
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి సుజనా చౌదరికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. సుజనా చౌదరికి చెందిన ఓ కంపెనీ మారిషస్ బ్యాంకు నుంచి తీసుకున్న రూ.100 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. చెల్లించకపోతే ఆస్తుల జప్తు తప్పదని, జప్తు చేసుకునే అధికారం మారిషస్ బ్యాంకుకు ఉందని వెల్లడించింది.
దీనిపై తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు, హైదరాబాద్ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పులను సుప్రీం కోర్టు సమర్ధించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ రోహింగ్టన్ నారిమన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు చెప్పింది.
వివరాల్లోకి వెళితే సుజనా యూనివర్సల్‌కు చెందిన హెస్టియా హోల్డింగ్స్ లిమిటెడ్ కంపెనీ మారిషస్‌లో ఇనుము, ఉక్కు వ్యాపారం నిర్వహిస్తోంది. 2010లో మారిషస్ బ్యాంకుతో రూ.100 కోట్ల మేరకు (20 మిలియన్ డాలర్లు) రుణ ఒప్పందం కుదుర్చుకుని, 2012 లో రుణం తీసుకుంది.
ఈ రుణాన్ని తిరిగి చెల్లించాలని 2013లో బ్యాంకు ఆ సంస్ధకు నోటీసు ఇచ్చింది. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో సుజనా కంపెనీ విఫలమైంది. దీంతో మారిషస్ బ్యాంకు లండన్ కోర్టును ఆశ్రయించింది. దీంతో ఈ కేసుని విచారించిన కోర్టు రుణాన్ని తిరిగి చెల్లించాల్సిందేనని సుజనా కంపెనీని ఆదేశిస్తూ 2013 నవంబర్‌లో తీర్పు చెప్పింది.

ఈ ఆదేశాల ఆధారంగా రుణాన్ని చెల్లించాలని మారిషస్ బ్యాంకు సుజనా కంపెనీపై ఒత్తిడి తెచ్చింది. అయితే, బ్యాంకుకు సుజనా కంపెనీ సంతృప్తికర సమాధానం ఇవ్వకపోగా, రుణం చెల్లించడంపై మౌనం వహించింది. దీంతో కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకునేలా తమకు అధికారం కల్పించాలని విజ్ఞప్తి చేస్తూ, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో మారిషస్ బ్యాంకు పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్‌ను విచారించిన సిటీ సివిల్ కోర్టు, మారిషస్ బ్యాంకుకు అనుకూలంగా ఆస్తుల జప్తునకు అధికారం కల్పించింది. ఈ ఆదేశాలపై సుజనా కంపెనీ హైకోర్టులో సవాల్ చేసింది. హైకోర్టులో కుడా మారిషస్ బ్యాంకుకు అనుకూలంగానే తీర్పు వచ్చింది.
దీంతో సుజనా యూనివర్సిల్ కంపెనీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. సుప్రీం కోర్టులో సుజనా కంపెనీ హెస్టియా తరఫున లాయర్లు ఎంఎన్ రావు, రమేశ్‌లు వాదనలు వినిపించారు. లండన్ కోర్టు కేవలం మారిషస్ బ్యాంకు వాదనల ఆధారంగానే తీర్పు ఇచ్చిందని, తమ కంపెనీ వాదనలు వినలేదని తెలిపారు.
అంతేకాదు ఓ విదేశీ కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా భారత్‌లోని తమ కంపెనీ ఆస్తులను జప్తు చేయడం చెల్లుబాటవుతుందా అన్నది పరిశీలించాల్సి ఉందన్నారు. వాదనలు విన్న సుప్రీం కోర్టు ధర్మాసనం ఎట్టిపరిస్థితిలోనూ రుణ మొత్తం రూ.100 కోట్లు చెల్లించాల్సిందేనని సుజనా కంపెనీని ఆదేశించింది.












Click it and Unblock the Notifications