వివేకా కేసులో దర్యాప్తు అధికారి మార్పు ! ఆదేశాల జారీకి సిద్ధమైన సుప్రీంకోర్టు..
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వివేకా కేసు దర్యాప్తు సుదీర్ఘంగా సాగడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సుప్రీంకోర్టు ..దీనిపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు మధ్యాహ్నం కీలక ఉత్తర్వులు ఇవ్వబోతోంది.
వివేకానందరెడ్డి హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ ను కొనసాగించాలా వద్దా అనే దానిపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు సాగాయి. ఇప్పటికే రామ్ సింగ్ ఈ కేసులో సమర్ధంగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయంతో ఉన్న సుప్రీంకోర్టుకు.. నిందితులు బెయిల్ సందర్భంగా వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు కూడా తోడయ్యాయి. దీంతో ఇవాళ విచారణ సందర్భంగా కూడా సుప్రీంకోర్టు జడ్డి జస్టిస్ ఎంఆర్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.
వివేకా కేసులో దర్యాప్తు అధికారి రాంసింగ్ ను కొనసాగించడంపై న్యాయమూర్తి ఎం ఆర్ షా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ సుదీర్ఘంగా సాగుతున్న సీబీఐ దర్యాప్తుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ తన భర్తకు బెయిల్ ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సీబీఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరింది. దీంతో ఇవాళ ఈ కేసులో మరో దర్యాప్తు అధికారిపై సుప్రీంలో సీబీఐ నివేదిక అందజేసింది.
రాంసింగ్ తో పాటు మరొకరి పేరును సీబీఐ సూచించింది.

దీనిపై స్పందించిన జస్టిస్ ఎంఆర్ షా.. రాంసింగ్ ను కొనసాగించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. దర్యాప్తులో పురోగతి సాధించనప్పుడు రాంసింగ్ ను కొనసాగించడంలో అర్ధం లేదన్నారు. విచారణ ఆలస్యం అవుతున్నందున ఏ5 శివశంకర్ రెడ్డికి బెయిల్ మంజూరీ చేయాలని తులశమ్మ కోరుతున్న నేపథ్యంలో షా స్పందించారు. రాంసింగ్ కొనసాగింపుపై మధ్యాహ్నం రెండు గంటలకు ఉత్తర్వులు ఇస్తామని తెలిపారు.
మరోవైపు వివేకా కేసులో ఏప్రిల్ 15లోగా దర్యాప్తును పూర్తి చేస్తామని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. కొత్త దర్యాప్తు అధికారిని నియమించడం వల్ల దర్యాప్తు పూర్తి కావడానికి కనీసం మూడు నెలలు అయినా పడుతుందని, ఈలోగా ఏ 5 శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వాలని నిందితుడు శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తరపు న్యాయవాది సుప్రీంను కోరారు.












Click it and Unblock the Notifications