భారత ప్రజాస్వామ్యం మేడిపండు లాంటిది: జెపి ఆవేదన
విజయవాడ: భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మన దేశ వ్యవస్థ ప్రక్షాళన చెందాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడలో లోక్‌సత్తా సురాజ్య యాత్ర సదస్సు సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
విజయవాడలో జరిగిన లోక్‌సత్తా సురాజ్య యాత్ర సదస్సును ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ జ్యోతిప్రకాశనం చేసి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ నారాయణ్ మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ మేడిపండులాంటిదని, పైకి అంతా బాగున్నట్లు కనిపిస్తుందని, కానీ లోతుగా చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థ నుంచి ఏం జరగాలని ఆశించామో అది నేరవేరలేదని అన్నారు.

ఇంకా ఇలా అన్నారు...
జయప్రకాష్ నారాయణ్ ఇంకా మాట్లాడుతూ భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు చెదలు పట్టిందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు జరుగుతున్నాయి...శాంతియుతంగా అధికారం మారుతోంది కానీ...అనుకున్నట్లు ఫలితాలను మాత్రం ఇవ్వలేకపోతోందన్నారు. అందుకే అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం చివర నుంచి నాలుగో స్థానంలో ఉందన్నారు. ఉగ్రవాద పీడిత దేశాలైన సిరియా,ఇరాక్,ఇరాన్,లెబనాన్ మన కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాయని, ఇది కఠోరమైన సత్యమన్నారు.

ప్రభుత్వ పాత్ర ఏంటి?
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం పాత్ర అతి ముఖ్యమని, ప్రభుత్వం ఏం చేయాలి, దాని మౌలికమైన పాత్ర ఏంటి అనేది పార్టీలకు అతీతంగా ఆలోచించకపోవడం వల్లే మనం ఘోర వైఫల్యాన్ని చవి చూస్తున్నామన్నారు.

అవసరాల ఊబిలో...
బ్రిటీష్ వాళ్లు పోయి మన వాళ్లు అధికారం చేపడితే , ఆ జెండా మారి మన జండా వస్తే అద్భుతాలు జరుగుతాయని మహాత్మాగాంధీ భావించలేదని, నిజమైన స్వరాజ్యం రావాలని కోరుకున్నారని, అది నిజమైన ప్రజాస్వామ్యం వర్థిల్లినపుడే సాధ్యమన్నారు. ప్రజాస్వామ్యం బతకాలంటే పౌరుడికి జవాబుదారీగా, పాలనా యంత్రాంగం ఎట్లా ఉండాలనేది ఆలోచన చేయాలన్నారు. ప్రభుత్వాలన్నీ వ్యవస్థను ఎలా మార్చాలని కాకుండా, ఎలా ప్రజల అవసరాలను తీర్చాలనే ఊబిలో పడిపోయాయని అన్నారు.

లోక్ సత్తా సురాజ్య ఉద్యమం....
లోక్ సత్తా సురాజ్య ఉద్యమం ఫలితాలు ఒక్క రోజులో రావని, చరిత్రలో ప్రజాస్వామ్య పునాదులు పడడానికి మాత్రం ఈ ఉద్యమం అపారంగా ఉపకరిస్తుందన్నారు. ప్రస్తుతం సురాజ్య యాత్ర ద్వారా చేస్తున్న పనులు, ఉత్పత్తి చేస్తున్న ఆలోచనలు, ప్రచారం చేస్తున్న భావజాలం ఇప్పటికి చాలా మామూలుగా కనిపిస్తుందని, కానీ చరిత్ర నిర్మాణం దీనిని నుంచే జరుగుతుందని వెల్లడించారు.












Click it and Unblock the Notifications