రాష్ట్ర ప్రయోజనాల కోసమేనా?: కేంద్రంతో చంద్రబాబు విందు రాజకీయం!
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకునే విషయంలో మీన మేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చుకునే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తాజాగా విందు రాజకీయాలకు తెరతీశారు. ఇందులో భాగంగా మిత్రధర్మంలో భాగంగా ఏపీ నుంచి బీజేపీ తరుపున రాజ్యసభకు ఎన్నికైన కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభుకు చంద్రబాబు విజయవాడలో విందు ఏర్పాటు చేశారు.
ఈ విందు సుమారు రెండు గంటలకు పైగా సాగిందని తెలుస్తోంది. ఈ విందు భేటీలో కేంద్ర మంత్రి సురేశ్ ప్రభు నుంచి చంద్రబాబు ఆశించిన మేర ఫలితాన్ని రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఈ విందు భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సురేశ్ ప్రభు విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయడానికి పెద్దగా ఇబ్బందేమీ లేదని చెప్పడం విశేషం.
అయితే విభజన చట్టంలో ఆ అంశాన్ని అప్పటి యూపీఏ ప్రభుత్వం పొందుపరచలేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్‌ను తప్పక ఏర్పాటు చేస్తామని ఆయన స్పష్టమైన ప్రకటన కూడా చేశారు. ఇక అంతక ముందు రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న పలు రైల్వే ప్రాజెక్టుల విషయంలో మంత్రి స్పష్టమైన హామిని ఇచ్చారు.

విజయవాడకు స్మృతీ ఇరానీ
ఎన్డీఏ ప్రభుత్వం రెండేళ్ల పాలన ముగిసిన నేపథ్యంలో బీజేపీ దేశ వ్యాప్తంగా 'వికాస్ పర్వ్' పేరిట సభలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మంగళవారం విజయవాడలో వికాస్ పర్వ్ సభకు బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమానికి బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాధాకృష్ణన్‌లు ఈరోజు విజయవాడకు వస్తున్నారు.
ఈ ఉదయం విజయవాడకు చేరుకునే ఆమె, ఉదయం 11:30 గంటల సమయంలో వన్ టౌన్ పరిధిలో జరిగే ఓ కార్యక్రమంలో పాల్గొని కాలేజీ విద్యార్థులతో ఆమె ముఖాముఖి జరపనున్నారు. మధ్యాహ్న భోజన సమయంలో వీరు చంద్రబాబు ఇంటికి వెళ్లనున్నారు.
కేంద్ర మంత్రులకు ఆంధ్రా రుచులను పరిచయం చేయనున్న చంద్రబాబు, అనంతరం వారి శాఖలకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టుల గురించి వారితో చర్చించనున్నారు. ఇక భోజన విరామ అనంతరం సాయంత్రం 4 గంటలకు ఓ బహిరంగ సభలో పాల్గొంటారని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటం కోసం, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల కోసం చంద్రబాబు ఈ విందు రాజకీయాలకు తెర తీసినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications