తేలని వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్-ఇవాళ తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు నిస్సహాయత..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పై తీర్పు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ హైకోర్టులో అవినాష్ దాఖలు చేసిన పిటిషన్ పై గత కొన్నిరోజులుగా వాదనలు వింటున్న ధర్మాసనం.. ఇవాళ తీర్పు వెలువరిస్తుందని అంతా భావించినా అలా జరగలేదు. ఈ పిటిషన్ పై తీర్పు వెలువరించే విషయంలో తెలంగాణ హైకోర్టు నిస్సహాయత వ్యక్తం చేసింది.

వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ వరుసగా మూడోరోజు తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. మరోవైపు రేపటి నుంచి తెలంగాణ హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నాయి. దీంతో ఇవాళ తీర్పు వెలువరించే విషయంలో ధర్మాసనం నిస్సహాయత వ్యక్తం చేసింది. ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ కు మార్చుకుంటారా అని పిటిషనర్, ప్రతివాదుల్ని ధర్మాసనం ప్రశ్నించింది. కానీ అత్యవసర పరిస్ధితుల నేపథ్యంలో ఇందుకు ఇరుపక్షాలు అంగీకరించలేదు.
అత్యవసరమైతే ఇరుపక్షాలు హైకోర్టు ఛీఫ్ జస్టిస్ బెంచ్ ను సంప్రదించాలని న్యాయమూర్తి జస్టిస్ సురేంద్ర సూచించారు. దీంతో ఇరుపక్షాలు ప్రత్యామ్నాయాలపై దృష్టిసారించాయి. ఛీఫ్ జస్టిస్ బెంచ్ ను సంప్రదించేందుకు ఇరుపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి కూడా విచారణ జరగకపోతే వేసవి సెలవులు పూర్తయ్యే వరకూ ముందస్తు బెయిల్ లభించే అవకాశం లేదు. ఆ లోపు సీబీఐ అవినాష్ ను అరెస్టు చేస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఇప్పటికే సీబీఐ ఈ కేసులో అవినాష్ ను అరెస్టు చేసి తీరాల్సిందేనని హైకోర్టుకు పలుమార్లు తెలిపింది. నిన్నటి విచారణలోనూ సీబీఐ న్యాయవాదిగా ఉన్న పీపీ నాగేంద్ర.. అవినాష్ ను అరెస్టు చేయకుండా కస్టోడియల్ విచారణ చేయడం సాధ్యం కాదని తేల్చిచెప్పేశారు. అయితే ముందస్తు బెయిల్ పై హైకోర్టు తీర్పు పెండింగ్ లో ఉండగా సీబీఐ దూకుడుగా ముందుకెళ్లకపోవచ్చని తెలుస్తోంది. అదే జరిగితే అవినాష్ కు ఊరట లభించినట్లే.












Click it and Unblock the Notifications