పవన్ సేఫ్ సీటు ఎక్కడ - పోటీ పై కొనసాగుతున్న డైలమా..!!
జనసేనాని పోటీ చేసే నియోజకవర్గం ఏది. టీడీపీతో పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు దక్కాయి. పవన్ తన తొలి జాబితాలో 5 నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించారు. తాను పోటీ చేసే స్థానం పైన స్పష్టత ఇవ్వలేదు. ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలు పోటీ చేసే స్థానాల పైన క్లారిటీ వచ్చింది. పవన్ పోటీ ఎక్కడనే సస్పెన్స్ మాత్రం కొనసాగుతోంది. తొలుత భీమవరం అని భావించినా తరువాత నాలుగు స్థానాల్లో సర్వేలు చేయిస్తున్నారు.
పోటీ స్థానం ఏది : పవన్ కల్యాన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దాని పైన ఇంకా సందిగ్ధంలో ఉన్నారు. పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారని కొద్ది రోజల క్రితం అక్కడ పర్యటన సమయంలో సంకేతాలు ఇచ్చారు. కానీ, నిర్ణయం మారింది. భీమవరం నుంచి పవన్ పోటీ ఆలోచన విరమించుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో పిఠాపురం వైపు పవన్ ఆలోచన చేస్తున్నారు. పిఠాపురంలో సామాజిక సమీకరణాలు కలిసి వస్తాయని, గెలుపు ఖాయమంటూ పార్టీ నేతలు అంచనా వేసారు. కానీ, వైసీపీ నుంచి ఆపరేషన్ పిఠాపురం మొదలు పెట్టారు. స్థానికంగా కాపు నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో టచ్ లోకి వెళ్లారు. స్థానికంగా పట్టు ఉన్న వంగా గీతను అక్కడ అభ్యర్దిగా ఖరారు చేసారు. దీంతో, మరోసారి పవన్ ఆలోచన మారినట్లు చెబుతున్నారు.

లక్ష్యం నెరవేరేనా : ఈ సారి ఎలాగైనా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది పవన్ లక్ష్యం. దీంతో..పిఠాపురంలో అవకాశాలను పరిశీస్తూనే గాజువాక లో సర్వే చేయిస్తున్నారు. అక్కడ 2019 ఎన్నికల్లో పోటీ చేసి పవన్ ఓడిపోయారు. ఈ సారి అక్కడ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాల పైన ఆరా తీస్తున్నారు. దీంతో పాటుగా తాడేపల్లిగూడెంలోనూ పవన్ పేరుతో సర్వేలు జరుగుతున్నాయి. తాడేపల్లిగూడెం నుంచి జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ రేసులో ఉన్నారు. గాజువాక, పిఠాపురం కంటే తాడేపల్లి గూడెం సేఫ్ సీటుగా పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడి సామాజిక సమీకరణాలు గెలుపుకు సహకరిస్తారనే లెక్కలు వేస్తున్నారు. పవన్ ఇప్పటి వరకు తాను పోటీ చేసే స్థానం ప్రకటించకపోవటం..పలు నియోజకవర్గాల్లో సర్వే చేయటం జనసేన కేడర్ కు అంతు చిక్కటం లేదు.

అక్కడే డిసైడ్ చేస్తారా : పవన్ సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం సాగింది. కానీ, ఇప్పుడు నాగబాబు పోటీ ప్రతిపాదన పెండింగ్ లో ఉంచినట్లు తెలుస్తోంది. పవన్ ను అనకాపల్లి నుంచి కాకుండా మరో స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు సమచారం. ఇక. బీజేపీతో పొత్తు సంగతి తేలిన తరువాత టీడీపీ - జనసేన తమ రెండో జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. బీజేపీ నిర్ణయం పైన స్పష్టత రావటం లేదు. గోదావరి జిల్లాల నుంచే పోటీ చేయాలనేది పవన్ ఆలోచనగా సమాచారం. జనసేన మరో 19 స్థానాలకు తమ అభ్యర్దులను ఖరారు చేయాల్సి ఉంది. దీంతో, ఇప్పుడు పవన్ కళ్యాణ ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..ఫలితం ఎలా ఉంటుందనే ఉత్కంఠ జనసేనలో కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications