పిఠాపురంలో ఇంత జరుగుతుంటే..మీరేం చేస్తున్నట్టు?
SVSN Varma: రాష్ట్రంలో యథేచ్ఛగా కొనసాగుతున్న ఇసుక అక్రమ రవాణా వ్యవహారం.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తోంది.
ఇసుక అక్రమ రవాణా పట్ల తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే అసంతృపిని, అసహనాన్ని వ్యక్తం చేస్తోన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో దీని తీవ్రత మరింత అధికంగా ఉందంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆందోళన వ్యక్తం చేశారు.

యూ కొత్తపల్లి మండలం మల్లివారితోట తీరంలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తోన్నారని ఎస్‌వీఎస్‌ఎన్ వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో ఇసుకను పెద్ద ఎత్తున లారీల్లో తరలిపోతుందని, వాటిని అరికట్టాల్సిన పోలీసులు రేచీకటి వచ్చినట్లు వ్యవహరిస్తోన్నారని విమర్శించారు. వారికి ప్రత్యేక కళ్లద్దాలు వేయించాల్సిన అవసరం ఉందని ఎద్దేవా చేశారు.
మల్లివారితోటలో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగిన ప్రాంతాన్ని వర్మ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. రైతులు గానీ, పేద కుటుంబాలకు చెందిన వాళ్లు తమ అవసరం కోసం ఓ నాలుగు తట్టల మట్టి తవ్వుకుంటే పోలీసులు వాళ్లను అరెస్ట్ చేస్తోన్నారని వర్మ అన్నారు.
వందల లారీల్లో ఇసుక తరలిపోతోండటం జిల్లా అధికార, పోలీసు యంత్రాంగానికి కనిపించట్లేదా? అని ప్రశ్నించారు. కొత్తపల్లి మండలానికి చెందిన కొంతమంది జనసేన నాయకులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారికి అండగా ఉంటున్నారని వర్మ ఆరోపించారు.
రమణక్కపేటలోనూ ఇదే తంతు కొనసాగుతోందని, రోజు 200 నుంచి 300 లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నప్పటికీ పోలీసులకు గానీ, రెవెన్యూ అధికారులకు ఎందుకు కనిపించట్లేదని పిఠాపురం వర్మ ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఇసుక అక్రమ రవాణాదారులతో పోలీసులు కుమ్మక్కవుతున్నారని ఆరోపించారు.
ఇసుక అక్రమ తరలింపు వ్యవహారం విషయంలో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఇప్పటికైనా అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంలో టీడీపీ కూటమి ప్రభుత్వం జిల్లా అధికార, పోలీసు యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications