శ్రీకాకుళం జిల్లాలో విషాదం: ఈతకు వెళ్లిన ముగ్గురు విద్యార్ధుల మృతి
అమరావతి: రిపబ్లిక్ డే రోజున శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని కనుగులవానిపేట వద్ద వాగులో పడి ముగ్గురు విద్యార్ధులు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం మంగళవారం సెలవు దినం కావడంతో ఆరుగురు విద్యార్థులు నారాయణపురం లింక్ కెనాల్‌లో ఈతకు వెళ్లారు.
వాగులోకి దిగిన వెంటనే ముగ్గురు విద్యార్ధులు ఊబి ఉన్న ప్రాంతంలో కూరుకుపోయారు. దీంతో మిగిలిన విద్యార్థులు గట్టిగా కేకలు వేస్తూ, ఊబిలో కూరుకుపోయిన విద్యార్ధులను కాపాడే ప్రయత్నం చేసినప్పటికి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిని లావణ్య(9), మణికంఠ(7), సంగీత(6)లుగా గుర్తించారు.

వీరంతా పదో తరగతి చదువుతున్నట్లు సమాచారం. విద్యార్ధులు మరణించిన సమాచారాన్ని తెలుసుకున్న ఆధికారులు వాగు వద్దకు చేరుకుని మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. విద్యార్ధులు ముగ్గురు ఒకే ఊరికి చెందిన వారు కావడంతో కనుగులవానిపేటలో విషాదం అలుముకుంది.
రిపబ్లిక్ డే వేడుకల్లో అపశృతి
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి మండలం కావేరిసముద్రం గ్రామంలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జాతీయజెండాను సరిచేసేందుకు ఇద్దరు విద్యార్థులు పక్కనే ఉన్న భవనం ఎక్కారు. జెండాను సరిచేసే సమయంలో పక్కనే ఉన్న కరెంట్ తీగలు తగిలి వంశీవర్ధన్(13) అనే 8వ తరగతి విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందగా.. మనోజ్ అనే విద్యార్థికి గాయాలయ్యాయి.












Click it and Unblock the Notifications