లడ్డు వివాదం వెనక ఉన్నదెవరు..!!
దేశవ్యాప్తంగా సంచలనానికి కారణమైన తిరుమల లడ్డు వివాదం పైన తెలంగాణ కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ లడ్డు వివాదం వెనక బిజెపి కుట్ర ఉందంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఏపీలో బిజెపి ఆట మొదలుపెట్టినట్లు అనిపిస్తుందని చెప్పుకొచ్చారు. పకడ్బందీ చర్యలు తీసుకొని తిరుమల భక్తులకు భరోసా ఇవ్వాలని కోరారు.
తిరుమల లడ్డు వివాదంపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తిరుమల లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏంటనేది భక్తులకు స్పష్టం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఏం జరిగింది అనే విషయాలను మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా ఉంటాయన్నారు. ఇక్కడ జరిగిన అంశాల కంటే రాజకీయ లబ్ధి ,మతపరమైన అంశాలపై చర్చ ఎక్కువగా జరిగి వాస్తవాలు మరుగున పడిపోతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలను వెంటనే బయటపెట్టాలని కోరారు.

ఇలా చేయకుండా చంద్రబాబు దీన్ని రాజకీయం చేయటం, మత ప్రస్తావన తేవటం, జగన్ పేరు ప్రస్తావన చేయటంతో వ్యక్తిగతంగా తనకు కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పారు, బిజెపి ఏమైనా చంద్రబాబుతో మతపరమైన రాజకీయాలకు తెరతీస్తుందా అనేది తన అనుమానమని వెల్లడించారు, ఎమోషనల్ గా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయం చేయటమే బిజెపి ఎజెండా అని విమర్శించారు.
ఏపీలో చంద్రబాబు అరెస్టు సమయంలో తాము పార్టీలకతీతంగా స్పందించి ఖండించామని చెప్పారు. ఏపీలో భవిష్యత్తులో కాంగ్రెస్ కు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పడతారని నమ్మకం ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాహుల్ నాయకత్వంలోనే జరుగుతుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కూడా రాహుల్ గాంధీ పూర్తి చేస్తారని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications