నీ పెళ్లి చేస్తాం, ఎంత తిట్టినా తక్కువే: బాబుపై టి నేతలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పైన తెలంగాణ కాంగ్రెసు పార్టీ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్ అలీలు ఆదివారం నిప్పులు చెరిగారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఏమైనా అంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.
సోనియాను చంద్రబాబు మరోసారి విమర్శిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని షబ్బీర్ అలీ అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావును మానసికంగా హింసించిన చంద్రబాబు హంతకుడన్నారు. సోనియా గాంధీని గాడ్సే అనడం విడ్డూరమన్నారు. అసలు గాడ్సేనే చంద్రబాబు అన్నారు.

తమది గాంధేయవాద పార్టీ అని అందుకే ఏమనడం లేదన్నారు. తమ పార్టీ అధినేత్రి పైన మరోసారి నోరు జారితే ఖబడ్దార్ అన్నారు. ఆయనకు అదే ప్రజల ముందు సమాధానం చెబుతామన్నారు. మళ్లీ నోరు జారితే నీ పెళ్లి చేస్తాం అంటూ హెచ్చరించారు.
సోనియా గాంధీ కుటుంబం త్యాగాల కుటుంబమని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డిలు అన్నారు. హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలంగాణ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు సమన్యాయం పేరుతో మోసం చేస్తున్నారన్నారు.
చంద్రబాబును ఎంత తిట్టినా తక్కువేనని మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఆయనవి దిగజారుడు రాజకీయాలని ధ్వజమెత్తారు.
సోనియాను గాడ్సేతో పోల్చడం సిగ్గుచేటు అని పిసిసి మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ అన్నారు. చంద్రబాబు వెంటనే సోనియాకు క్షమాపణ చెప్పాలన్నారు. ఈ నెల 21వ తేదీ లోపు ఊభయ సభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం ఖాయమన్నారు. ఎవరికి న్యాయ చేయకపోవడమే బాబు సమన్యాయమని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications