19లోగా టీ బిల్లు పాస్, బిజెపి చెప్పడం లేదు: కెసిఆర్
న్యూఢిల్లీ: ఈ నెల 19 లోగా పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు చెప్పారు. ఈలోపు అనవసరమైన లొల్లి చేసి, కాంగ్రెస్ పార్టీని అయోమయంలో పడేయవద్దని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన బిల్లు ఆమోదానికి కష్టపడుతున్న వారికి సహకరించాలని సూచించారు. శుక్రవారం తన నివాసంలో పార్టీ నేతలు, తెలంగాణ జెఎసి బృందం కలిసినప్పుడు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తున్నామని బిజెపి చెప్పటం లేదని, అంటే ఆ పార్టీ రాష్ట్ర విభజనకు సహకరిస్తున్నట్లేనని ఆయన అన్నారు. ఆ పార్టీ నాయకురాలు సాంకేతికమైన అంశాలను మాత్రమే ప్రస్తావించారని, అయినా ఈనెల 17, 18, 19 (సోమ, మంగళ, బుధ) తేదీల్లో జాగ్రత్తగా ఉండాలని, అంతా సంయమనం పాటించాలని సూచించారు.

పార్లమెంటులో ఇదే రకంగా అల్లరి జరిగితే సమావేశాలను పొడిగించే అవకాశం ఉందని, మార్చి 3న సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందంటున్నారని కెసిఆర్ అన్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటివరకు సమయం ఉన్నప్పటికీ, అంత దూరం వెళ్లకుండా ఈలోపే తెలంగాణ బిల్లును ఆమోదించాలని కాంగ్రెస్ పెద్దలకు చెప్పానని ఆయన అన్నారు. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియాగాంధీ ఒక్కరే సిన్సియర్‌గా ఉన్నారని, ఆమె తలుచుకోకపోతే ఇబ్బందిగా ఉండేదని కెసిఆర్ అన్నట్లు చెబుతున్నారు.
తెలంగాణ వచ్చేటట్టు ఉందని, వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రం వచ్చాకే తెలంగాణలో అడుగుపెడతామని చెప్పి వచ్చామని, అలాగే వెళ్దామని ఆయన అన్నారు. కాగా, హైదరాబాద్‌లోనే ఉండిపోయిన మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలు కూడా తక్షణం ఢిల్లీకి రావాలని కెసిఆర్ ఆదేశించినట్లు తెరాస వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications