జగన్ కు మైగ్రెయిన్ తలనొప్పిని తెచ్చిన ఆ రెండు..?
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న ఆధిపత్య పోరు కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. అత్యంత కఠిన పరిస్థితుల మధ్య ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, గెలిస్తేనే నిలవగలుగుతామని, అందుకే గెలుపు గుర్రాలకే సీటివ్వదలుచుకున్నానని మంత్రులకు, ఎమ్మెల్యేలకు తేల్చిచెబుతున్నారు.

నివేదికలు అందజేసిన ఇంటిలిజెన్స్
వైఎస్ జగన్ చెప్పినప్పుడు సమావేశాల్లో ఊ కొట్టిన నేతలు నియోజకవర్గాలకు వెళ్లిన తర్వాత ప్రత్యర్థి పార్టీల నేతలతో కాకుండా సొంత పార్టీల నేతలతోనే తలపడుతున్నారని ఇంటిలిజెన్స్ నివేదికలు అందజేసింది. అందులో ముఖ్యంగా రాజధాని పరిధిలోని తాడికొండ కాగా, రాజధాని జిల్లా అయిన ఉమ్మడి గుంటూరు జిల్లాలోని పొన్నూరు ఉంది.
మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను తాడికొండకు అదనపు సమన్వయకర్తగా పార్టీ నియమించింది. అప్పటి నుంచి ఎమ్మెల్యే శ్రీదేవి వర్గానికి, డొక్కా వర్గానికి ఆధిపత్య పోరు నడుస్తోంది. రెండుసార్లు నడిరోడ్డుపై ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. మీడియాతో మాట్లాడిన డొక్కా తాను తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఎమ్మెల్యే తండ్రి తనకు అత్యంత సన్నిహితుడని, ఇరువురి మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. కానీ నియోజకవర్గ పరిధిలో పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయింది.

సస్పెండైన రావి వెంకటరమణ
పొన్నూరు నుంచి 2014 ఎన్నికల్లో ఓటమిపాలైన రావి వెంకటరమణను పార్టీ ఇటీవలే సస్పెండ్ చేసింది. ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగా గత ఎన్నికల్లో జగన్ సీట్లు కేటాయించారు. దాని ఆధారంగానే రావిని పక్కనపెట్టి అప్పటికప్పుడు పార్టీలో చేరిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కిలారి వెంకటరోశయ్యకు సీటిచ్చింది. గెలిచిన తర్వాత రావి వెంకటరమణ వర్గం, కిలారి వర్గం ఢీ అంటే ఢీ అనేలా తయారయ్యాయి.
పలుసార్లు చెప్పినప్పటికీ గొడవలు తగ్గలేదు. ఇటీవలే రావి వర్గానికి చెందిన పెదకాకాని మండలాధ్యక్షుడు పూర్ణపై దాడి జరిగింది. దీనికి కారణం కిలారి వర్గమేనని పూర్ణ వర్గీయులు ఆరోపిస్తున్నారు. నిరసనగా పెదకాకాని సెంటర్ లో ఆ వర్గానికి వ్యతిరేకంగా రావి వర్గం ఆందోళన నిర్వహించింది.

మట్టి తవ్వకాలపై ధూళిపాళ్ల ఆరోపణ
నియోజకవర్గ పరిధిలో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపిస్తున్నారు. ఆయన స్వయంగా మట్టి తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి ట్రాక్టర్లను, జేసీబీలను అడ్డుకొని ఎమ్మెల్యే వెంకటరోశయ్యపై ఆరోపణలు చేశారు. మట్టి మాఫియా అంశం బయట పడటానికి రావి వెంకటరమణ వర్గమే ప్రధాన కారణమని భావించిన కిలారి ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దీంతో రావిని సస్పెండ్ చేశారు. ప్రధానంగా ఈ రెండు నియోజకవర్గాలు అమరావతి పరిధిలో ఉండటంతో ముఖ్యమంత్రి జగన్ వెంటనే జోక్యం చేసుకొని పరిస్థితిని చక్కదిద్దాలని వైసీపీ శ్రేణులు కోరుతున్నాయి.












Click it and Unblock the Notifications