సిఎం సీటు, సీట్లకోసం బిజెపి పట్టు: అన్నింటికి టిడిపి నో
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపిల మధ్య పొత్తపై సస్పెన్స్ కొనసాగుతోంది. అంతర్గతంగా పొత్తు విషయం కొలిక్కి వచ్చినప్పటికీ సీట్ల పంపకంలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి పదవి, 64 నుండి 70 అసెంబ్లీ స్థానాలు, 9-11 లోకసభ స్థానాలు ఇవ్వాలని తెలంగాణ బిజెపి పట్టుబడుతోంది. సీమాంధ్రలో 7 పార్లమెంటు స్థానాలు, 30 అసెంబ్లీ స్థానాల కోసం సీమాంధ్ర బిజెపి డిమాండ్ చేస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్‌కు ఇరు ప్రాంతాల నేతలు చెప్పారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇన్‌చార్జి ప్రకాశ్ జవదేకర్ గురువారం హైదరాబాద్ వచ్చారు. తెలంగాణ, సీమాంధ్ర నేతలతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. పార్టీ నేతల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నేతలు సుస్పష్టంగా తమ అభిప్రాయాలను స్పష్టం చేసినట్లు తెలిసింది. తెలంగాణలో టిడిపితో పొత్తు పెట్టుకుంటే సిఎం పదవిని బిజెపికే ఇవ్వాలని, 11 వరకు పార్లమెంటు, 70 వరకు ఎమ్మెల్యే సీట్లను కేటాయించాలని స్పష్టం చేసిందని తెలుస్తోంది.

లేకపోతే పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లడం మేలని తేల్చి చెప్పారని తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ ఉద్యమం, నరేంద్ర మోడీ ప్రభంజనం కారణంగా తెలంగాణలో పార్టీకి ఓటు బ్యాంకు పెరిగిందని, టిడిపితో పొత్తు పెట్టుకుంటే ఇది దూరమవుతుందని, ఒకవేళ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో టిడిపిపై బిజెపిదే పెత్తనం ఉండాలని, అలాగైతేనే పొత్తుకు సిద్ధం కావాలని స్పష్టం చేశారట. సీమాంధ్ర నేతలు కూడా పొత్తుపై తమ వాదనను గట్టిగా వినిపించినట్లు తెలిసింది.
సీమాంధ్రలో ఏడు పార్లమెంటు, 30 అసెంబ్లీ సీట్లను కోరాలని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిడిపితో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా బిజెపి 272 సీట్ల మేజిక్ ఫిగర్ దాటుతుందని, అప్పుడు టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, జనసేన వంటి పార్టీల అవసరమే ఉండదని చెప్పారట. సీమాంధ్రలోనూ పార్టీకి 10 నుంచి 15 శాతం మేర ఓటు బ్యాంకు పెరిగిందని, ఈ భరోసాతో ఒంటరిగానే ఎన్నికలకు వెళదామని స్పష్టం చేసినట్లు తెలిసింది.
ఈ నేపథ్యంలోనే తాము డిమాండ్ చేసినట్లు సీట్లు కేటాయిస్తే పొత్తుకు అంగీకరించాలని చెప్పినట్లు సమాచారం. ఇరు ప్రాంతాల నేతల అభిప్రాయాలను విన్న జవదేకర్ ఈ విషయాన్ని పార్టీ జాతీయ నేతలకు తెలియజేస్తానని, వారి నిర్ణయం ప్రకారమే పొత్తులపై ముందుకు వెళదామని చెప్పినట్లు తెలిసింది. కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో అన్న నినాదంతో ముందుకొచ్చే పార్టీలతో తమ పార్టీ పొత్తు పెట్టుకుంటుందని జవదేకర్ తెలిపారు.
శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ, సీమాంధ్రల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని, హైదరాబాద్ పర్యటనలో టిడిపి, జనసేనతో పొత్తులపై చర్చిస్తానని తెలిపారు. అయితే, రెండు ప్రాంతాల్లోనూ కలిపి బిజెపికి ఎనిమిది ఎంపీ, 24 ఎమ్మెల్యే సీట్లు ఇస్తామని టిడిపి ప్రతిపాదించినట్లు తెలిసింది. 1999లో బిజెపితో టిడిపిపొత్తు పెట్టుకున్నప్పుడు బిజెపికి ఆరు ఎంపీ, 24 అసెంబ్లీ సీట్లను కేటాయించింది.
ఇప్పుడు ఆరుకు బదులు ఎనిమిది ఎంపీ సీట్లను ఇస్తామని ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్ మధ్య అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయని, పొత్తును బిజెపి జాతీయ నేతలు అంగీకరిస్తే తెలంగాణ, సీమాంధ్ర నేతలు ఒప్పుకోక తప్పదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications