Talliki Vandanam: తల్లికి వందనం రెండో విడతకు ముహుర్తం ఫిక్స్- కీలక అప్డేట్..!
ఏపీలో తల్లికి వందనం (Talliki Vandanam) పథకం కింద పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే పిల్లల తల్లులకు ఇస్తున్న 13 రూపాయల నిధుల్ని ఈ ఏడాది కూడా విడుదల చేశారు. అయితే కొత్తగా స్కూళ్లు, కాలేజీల్లో జాయిన్ కావడంతో పాటు వివిధ కారణాలతో ఈ నిధులు చాలా మందికి అందలేదు. ఈ నేపధ్యంలో లబ్దిదారుల గుర్తింపును ఇప్పటికే పూర్తి చేశారు. అయితే నిధులు మాత్రం విడుదల కాలేదు. దీంతో వీరంతా ఆందోళనలో ఉన్నారు. తాజాగా ప్రభుత్వం ఈ తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు చర్యలు ప్రారంభించింది.
తల్లికి వందనం పథకం కింద ఈ ఏడాది ఇవ్వాల్సిన మొత్తాన్ని 64.76లక్షల మంది విద్యార్దుల తల్లుల ఖాతాల్లో జూలైలో జమ చేశారు. అయితే ఇంకా ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లు, మార్పులు చేర్పుల వంటి కారణాలతో మరో 2.7లక్షల మంది ఇవి అందలేదు. దీంతో వారికి ఇప్పుడు రెండో విడతలో ఇచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఆగస్టు 30న వీరి ఖాతాల్లో తల్లికి వందనం నిధులు జమ చేస్తామని ప్రకటించినా.. చివరి నిమిషంలో వాయిదా పడింది. దీంతో దాదాపు 3 లక్షల మంది విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో వచ్చే వారం ఈ నిధుల జమకు ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.

ఇప్పటికే ఆయా లబ్దిదారులైన విద్యార్ధులు, తల్లుల ఖాతాల పరిశీలన పూర్తయింది. అలాగే వీరికి నిధులు విడుదల చేసేందుకు ఆర్ధిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది. ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆమోద ముద్ర వేసినట్లు తెలుస్తోంది. దీంతో వచ్చే వారం తల్లికి వందనం రెండో విడత నిధుల విడుదలకు మార్గం సుగమం అయింది. ఇందుకోసం విద్యార్థి, తల్లి ఆధార్, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్ఎస్సీ, ఆధార్ లింకింగ్, పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇవన్నీ సక్రమంగా ఉంటే వచ్చే వారం వీరి ఖాతాల్లో నిధులు జమ అయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ప్రతీ ఇంట్లో ఎంత మంది చదువుకుంటున్న పిల్లలుంటే అంతమందికీ 13 వేల చొప్పున నిధులు జమ చేస్తున్నారు.














Click it and Unblock the Notifications
