తెలంగాణలో కరవు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది.. కేంద్రం ఆదుకోవాలి: కవిత

రాష్ట్రంలో కరవు పరిస్థితి చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌ రెడ్డి వరుణయాగం చేసి చేతులెత్తేశారని విమర్శించారు. ఇప్పటికీ కరవు మండలాలను ప్రకటించకపోవడం వల్ల రైతులకు కేంద్రం నుంచి రావాల్సిన సహాయం అందడం లేదన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని ఆరు నెలల ముందే ప్రపంచానికి సైంటిస్టులు హెచ్చరించారని కానీ ఈ ప్రభుత్వం ఏనాడూ కనీసం రివ్యూ చేసి పరిస్థితిని తెలుసుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. కృష్ణ జలాలు కుప్పం వరకు తరలిపోతున్నాయని.. పాలమూరుకు నీళ్లు రావడం లేదని, సీఎం చంద్రబాబుకు నీళ్లను బహుమతిగా ఇస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు విద్యుత్ ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. ఇక ఖైరతాబాద్ సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన సరే తాము పోటీ చేస్తామని స్పష్టం చేశారు.

"రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కరువు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోంది. అన్ని జిల్లాల్లో కరువు తాండవం చేస్తోంది. భూగర్బ జలాలు కొన్ని చోట్ల 20 మీటర్ల లోతుకు పడిపోయాయి. చాలా చోట్ల రైతన్నలు తమ పంటలు కాల్చుకుంటున్న పరిస్థితి చూస్తున్నాం. జులైలో 1 శాతం తక్కువ వర్షపాతం నమోదైతే ఆగస్ట్ లో 38, సెప్టెంబర్ 30 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది సూపర్ ఎల్ నినో ఉంటుందని ఆరు నెలల ముందే ప్రపంచానికి సైంటిస్టులు హెచ్చరించారు. కానీ ఈ ప్రభుత్వం ఏనాడు కనీసం రివ్యూ చేసి పరిస్థితిని తెలుసుకున్న పాపాన పోలేదు" అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మండిపడ్డారు.

నీటి పారుదల, అగ్రికల్చర్, పవర్ మినిస్ట్రీలతో ముఖ్యమంత్రి సమీక్ష చేయాల్సింది పోయి పట్టించుకోలేదు. నాగార్జున సాగర్ కు పోయి వరుణయాగం చేసి దేవుడు వానలు కురిపిస్తే కురిపించినట్లు లేకుంటే మీ ఖర్మ అన్నట్లు వదిలేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ కోటి 20 లక్షల ఎకరాల పంట ఉంది. నవంబర్ వరకు ఆ పంటలకు సంపూర్ణంగా కరెంట్ ఇస్తేనే ఆ పంటలు బతుకుతాయి. కరెంట్ ఉంటేనే బోర్ల ద్వారా రైతులు పంటలను కాపాడుకునే పరిస్థితి ఉంది. కానీ రాష్ట్రంలో ఏ ఊళ్లో కూడా 6 నుంచి 7 గంటలు కూడా కరెంట్ రావటం లేదు. ముఖ్యమంత్రి సొంతూరు కొండారెడ్డి పల్లిలో కూడా 7 గంటలు కరెంట్ వస్తలేదు. మీరు అడుక్కుంటారో, కొనుక్కుంటారో మాకు తెలియదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని కవిత డిమాండ్ చేశారు.

మొన్న జరిగిన కేబినెట్ మీటింగ్ తర్వాత కరువు మండలాలను ప్రకటిస్తారని భావించాం. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ లు కరవు మండలాలను ఇప్పటికే ప్రకటించాయి. కరువు మండలాలను ప్రకటిస్తే కేంద్రం నుంచి మనకు సాయం అందే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వం కరువు ఉందని చెబితే కేంద్రం నుంచి వచ్చే బృందాలు విజిట్ చేసి సాయం చేయటం కష్టమైన పని. కనీసం కరువు మండలాలను కూడా గుర్తించలేని అచేతన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. రైతులను, పంటలను ఆదుకునేందుకు కచ్చితంగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలి. కరువుతో అల్లాడుతున్న మహారాష్ట్ర సహా దక్షిణాది రాష్ట్రాలను ఆదుకోవాలని ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ సమయంలో మీరు సాయం చేయకపోతే కచ్చితంగా ప్రజలు మిమ్మల్ని క్షమించరు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రం రూపాయి కూడా ఎక్కువ సాయం చేయలేదు. ఇప్పుడైనా తెలంగాణను ఆదుకోండి.. అని కవిత కీలక విజ్ఞప్తి చేశారు.

చాలా రాష్ట్రాల్లో అధికంగా కరెంట్ ఉత్పత్తి జరుగుతోంది. ఆ కరెంట్ ను దక్షిణాది రాష్ట్రాలకు ఉచితంగా ఇవ్వండి. మా ముఖ్యమంత్రి వరుణయాగం అంటూ రాష్ట్రాన్ని అచేతన స్థితిలో పెట్టారు. మీరైనా ఆదుకోండి. కరెంట్ సప్లయ్ లేకపోవటం కారణంగా కూరగాయలు సహా అన్ని నిత్యావసరాల వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. మేము గతంలోనే సింగరేణికి రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు కట్టకపోవటంతో కరెంట్ సప్లయ్ ఇబ్బంది అవుతుందని చెప్పాం. ఇప్పుడు సింగరేణి కరెంట్ ను వేరే రాష్ట్రాలకు అమ్ముతోంది. అప్పుడే బకాయిలు చెల్లించి ఉంటే ఇవ్వాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. గతంలో మేము చెప్పిన అన్ని అంశాలను బేరీజు వేసి చూస్తే ఈ ప్రభుత్వం ఎంత అసమర్థ ప్రభుత్వమో అర్థమవుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే 60 శాతం మంది రైతులు ఆగమయ్యే పరిస్థితి ఉందని కవిత తెలిపారు.

ఎండలు కూడా విపరీతంగా పెరిగే పరిస్థితి ఉందని చెబుతున్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేయాలి. ముఖ్యంగా కరువును ఎదుర్కొనేందుకు రైతుల సమస్యలు తీర్చేందుకు ప్రత్యేక కేబినెట్ సమావేశం పెట్టాలి. ఈ సమస్య ఇక్కడితోనే అయిపోదు. తాగునీటి సమస్య కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే అన్ని రిజర్వాయర్లలో డెడ్ స్టోరేజీ పరిస్థితి ఉంది. కనీసం కృష్ణాజలాలను కాపాడుకునేందుకు కూడా ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. మన నీళ్లను మహబూబ్ నగర్ నుంచి కుప్పం తరలిస్తున్న ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. నార్లపూర్ రిజర్వాయర్ కు కొంత ఖర్చు చేసి ఉంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ ఉండేది. కల్వకుర్తి పూర్తి కెపాసిటీ తో నీళ్లను నింపుకునే పరిస్థితి ఉండేది. కానీ మూడేళ్లలో ఆ చిన్న పని కూడా చేయలేకపోయారు. కానీ ఇప్పుడు కర్ణాటకను అడిగి నీళ్లు తెస్తున్నామని బిల్డప్ ఇస్తున్నారు. ఓ పక్క బిల్డప్ లు ఇస్తూనే మరోపక్క చంద్రబాబు కు నీళ్లను గిప్ట్ ప్యాక్ చేసి పంపిస్తున్నారు.. అని కవిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు మా నియోజకవర్గ ఇంఛార్జ్ లు ప్రతి గ్రామానికి వెళ్తారు. కరువు సమస్యలను ప్రభుత్వానికి తెలిపేందుకు మేము ప్రత్యేక కార్యాచరణ చేపడతాం. కరువు సమస్యలకు ఒక్క మంత్రిత్వ శాఖది కాదు మొత్తం ప్రభుత్వానిదే వైఫల్యం. ఒక్క రైతుల సమస్యలే కాదు ఇప్పటికే ఆపరేషన్ బ్లూ కోడ్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా హాస్పిటల్స్ లో పరిస్థితులను మా పార్టీ నాయకులు తెలుసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితిని దయచేసి మీడియా ఎన్ నినో అని కాకుండా తీవ్ర దుర్భిక్షమైన కరువు అని రాయాలి. భూపాలపల్లి హాస్పిటల్ లో సీలింగ్ కూలిన ఘటనను మేమే వెలుగులోకి తెచ్చాం. రిమ్స్ సంఘటనపై మేము పోరాటం చేస్తే ప్రభుత్వం అదే రోజు 11 కోట్లు రిలీజ్ చేసింది. భూపాలపల్లి ఘటనకు సంబంధించి వీడియో తీసిన మా పార్టీ కార్యకర్తను పోలీసులు బెదిరిస్తున్నారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న వాళ్లను బెదిరించటం కాకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్న వాళ్లపై చర్యలు తీసుకునేలా పోలీసులు పని చేయాలి అని కవిత డిమాండ్ చేశారు.

అలాగే 317 జీవో బాధితులను ఈ ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. రూపాయి ఖర్చు లేకుండా తీర్చే సమస్యను కూడా మూడేళ్లుగా తీర్చటం లేదు. పైగా ఆందోళన చేస్తున్న టీచర్లను గాంధీ జయంతి రోజు ఈడ్చుకెళ్లి వారిపై లాఠీ ఛార్జ్ చేశారు. గాంధీ సిద్దాంతాలను పాటిస్తామని చెప్పే కాంగ్రెస్ పార్టీ గాంధీ జయంతి రోజే ఇలా చేయవచ్చా? 317 బాధితుల్లో పోలీసులు కూడా ఉన్నారు. వారికోసం కూడా మేమే పోరాటం చేయాల్సి ఉంటుందని వాళ్లు అర్థం చేసుకోవాలి. సర్ ప్రక్రియలో జరిగిన తప్పిదాలకు సీఈసీ రాజీనామా చేస్తే సమస్య పరిష్కారం కాదు. టెంపరరీ సొలుష్యన్ కాకుండా సిస్టమ్ మార్పు వచ్చే విధంగా పర్మినెంట్ సొల్యుషన్ ఉండాలి. ముఖ్యంగా ఈవీఎంలు పోయి పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగాలి. అప్పుడు మాత్రమే పారదర్శకంగా ఎన్నికలు జరగుతాయని మేము భావిస్తున్నాం అని కవిత స్పష్టం చేశారు.

Kavitha said It heart wrenching to see the drought in Telangana the Centre must come to the rescue

అభివృద్ధి చెందిన అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల్లోనూ పేపర్ బ్యాలెట్ ద్వానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈవీఎం లను మ్యానిఫులేట్ చేసే అవకాశం ఉందని అభివృద్ధి చెందిన దేశాలు భావిస్తున్నాయి. మళ్లీ దేశంలో పేపర్ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగేందుకు మా పార్టీ తరఫున దిల్లీ వరకు వెళ్లి పోరాటం చేస్తాం. ఖైరతాబాద్ ఉప ఎన్నిక కు ఇంకా సమయం పట్టవచ్చని భావిస్తున్నాం. ఖైరతాబాద్ సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చిన సరే మేము పోటీ చేస్తాం. ఎన్నికలు అనేవి మా పార్టీ అజెండా చెప్పుకునేందుకు ఓ అవకాశంగా భావిస్తాం. అదే విధంగా భవిష్యత్ లో స్కూళ్లలో బాత్ రూమ్ లు, కనీస సౌకర్యాలు ఉన్నాయో లేదా అన్న దానిపై కూడా పరిశీలనకు పార్టీ బృందాన్ని నియమిస్తాం.. అని కవిత తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+