Talliki Vandanam: ఇల్లంతా వందనమే- ఏకంగా 78 వేలు పడ్డాయ్..!
ఏపీలో ప్రభుత్వం ఈ ఏడాది స్కూళ్లకు వెళ్లే విద్యార్ధులకు తల్లికి వందనం (Talliki Vandanam)పథకం కింద డబ్బుల్ని నిన్న విడుదల చేసింది. దీంతో విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో ఇవి వరుసగా జమ అవుతున్నాయి. బ్యాంకుల్ని బట్టి ప్రాంతాల వారీగా ఈ నిధులు విడుదల అవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఓ సంచలనం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు పిల్లలకు కలిపి ఏకంగా రూ.78 వేలు జమ కావడంతో వారు సంతోషంలో మునిగిపోయారు.
కర్నూలు జిల్లా మాధవరానికి చెందిన ఏలియా, సంగీత దంపతులకు ఆరుగురు సంతానం ఉన్నారు. వీరంతా తల్లికి వందనం పథకం కింద జబ్బుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి నిన్న విడుదల చేసిన నిధుల్లో ఆరుగురికీ కలిపి రూ.13 వేల చొప్పున రూ.78వేలు జమ అయ్యాయి. అలాగే రాష్ట్రంలోని నెల్లూరు, పల్నాడు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఐదుగురు పిల్లలు ఉన్నవారికి రూ.65వేలు జమయ్యాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అల్లవరం మండలం గోడిలో తల్లికి వందనం పథకం కింద ఒకే ఇంట్లో నలుగురు పిల్లలకు 52 వేలు జమ అయ్యాయి.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు కుటుంబాల్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికీ తల్లికి వందనం పథకం కింద నిధులు జమ అవుతుంటడంతో ఆయా కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిధులు జమ చేస్తుండటంతో వారు సంతోషంగా ఉన్నారు. ఈ ఏడాది తల్లికి వందనం నిధుల విడుదల కాస్త ఆలస్యమైనా ఎట్టకేలకు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. ఈ ప్రక్రియ రేపటి వరకూ కొనసాగనుంది. రేపటికి కూడా నిధులు పడని కుటుంబాలు స్థానిక సచివాలయాల్ని సంప్రదించి ఏవైనా లోపాలు ఉంటే సరిచేయించుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది.












Click it and Unblock the Notifications