శేషాచల మృతుల్లో రాజకీయ నేత, సెల్‌ఫోన్ కాల్ డేటాతో వాస్తవాలు...!
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో జరిగిన శేషాచలం ఎన్‌కౌంటర్‌లో రోజుకో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలీసులు, ఎర్రకూలీల మధ్య జరిగిన శేషాచలం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన వారిలో తమళనాడుకు చెందిన ఓ రాజకీయ పార్టీకి చెందిన జిల్లా నేత ఒకరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మృతుల నేర చరిత్రను సేకరించేందుకు తమిళనాడు వెళ్లిన ఏపీ పోలీసుల విచారణలో ఈ విషయం గుర్తించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం 20 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతి చెందిన వారి నుంచి స్వాధీనం చేసుకున్న సెల్ ఫోన్ల ఆధారంగా ఎర్రచందనం కూలీలు ఎవరెవరితో మాట్లాడారన్న కాల్ డేటాను పోలీసులు సేకరించారు.

ఈ కాల్ డేటాలో ఆశ్చర్యపోయే వాస్తవాలు తెలిశాయి. ఎన్‌కౌంటర్ జరగడానికి కొన్ని గంటల ముందు కూలీలు ఎర్రచందనం స్మగర్లతో టచ్‌లోనే ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు శేషాచలం ఎన్ కౌంటర్ తర్వాత తమిళనాడులోని ఆంధ్ర హోటల్స్, సంస్ధలపై జరగుతున్న దాడుల వెనుక ఎవరున్నారనే దానిపై కూడా ఏపీ పోలీసులు దృష్టి పెట్టారు.
ఇందుకోసం ఓ పోలీసు బృందం తమిళనాడుకు వెళ్లింది. ఈ దాడులకు ఎవరు ప్రోత్సహిస్తున్నారనే విషయాన్ని తెలుసుకుంటే ఎర్రచందనం స్మగ్లర్ల నెట్ వర్క్‌ను ఛేదించవచ్చని పోలీసు అధికారులు భావిస్తున్నారు. వీరితో పాటు ఎర్రచందనం స్మగ్లర్ల వివరాలు సేకరించేందుకు గాను సీఐడీ అధికారులు కూడా రంగంలోకి దిగినట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తిరుపతిలోని టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి సమాచారం సేకరించిన సీఐడీ అధికారులు.... కర్ణాటక, తమిళనాడుతో పాటు కడప, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లో ఎర్రచందనం స్మగ్లర్లుపై నిఘా పెట్టినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications