ప్లీనరీ జరుగుతుంటే ఇంట్లో కూర్చోవాలా - ఆ తర్వాతే స్పీకర్ ను : తమ్మినేని..!!
వైసీపీ ప్లీనరీ వేదికగా స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు చేసారు. స్పీకర్ హోదాలో పార్టీ ప్లీనరీలో పాల్గొనటం పైన తన వైఖరి తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ఏ గడపకు వెళ్లినా సీఎం జగన్ నామస్మరణే వినిపిస్తోందని చెప్పుకొచ్చారు. పరిపాలన వికేంద్రీకరణ-పారదర్శకత తీర్మానంపై చర్చలో ఆయన పాల్గొన్నారు. ప్లీనరీకి విప్లవంలా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు తరలివచ్చారన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్లీనరీకి విప్లవంలా తరలివచ్చారు. రాబోయే ఎన్నికల్లో మనం విజయం సాధించడమే అందరి లక్ష్యంగా చెప్పుకొచ్చారు.
కొన్ని మీడియా సంస్థలు స్పీకర్ పదవిలో ఉంటూ ప్లీనరీకి ఎలా హాజరవుతారని కథనాలు ఇచ్చారని చెబుతూ.. కీలక వ్యాఖ్యలు చేసారు. తాను ముందుగా వైసీపీ ప్రాధమిక సభ్యుడినని చెప్పారు. ఆ తర్వాతనే ఎమ్మెల్యేనని..ఆ తరువాతే స్పీకర్ ని అంటూ చెప్పుకొచ్చారు. పార్టీ ప్లీనరీ పండుగ జరుగుతుంటే... నేను ఇంట్లో కూర్చోవాలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో 30 లక్షల మందికి పైగా పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని.. 16 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయని వివరించారు.

దాదాపు 4 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ గ్రామసచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసారని చెప్పారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం జగన్ తీసుకొచ్చారని ప్రశంసించారు. సీఎం జగన్ తో ప్రయాణం చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామని స్పష్టం చేసారు. సంక్షేమ పాలన ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తం చేసారు. గతంలో టీడీపీ మహానాడులో ఆనాటి స్పీకర్ శివప్రసాద్ పాల్గొనలేదా అని అడిగారు. ఆ రోజు ఆయన మాట్లాడింది మీరు వినలేదా అంటూ తమ్మినేని నిలదీసారు.












Click it and Unblock the Notifications