తెలుగుదేశం పార్టీలోని బలమైన బీసీ నేతలే లక్ష్యం?
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత వ్యవహారం ప్రభుత్వ కక్షసాధింపేనని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. టీడీపీలో ఉన్న బలమైన బీసీ నేతలను లక్ష్యంగా ఎంచుకొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరెస్టులు, దాడులు, అక్రమ కేసులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
చోడవరంలో జరిగిన మినీ మహానాడులో జగన్ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకే అయ్యన్నపాత్రుడి ఇంటిపై దాడులకు పాల్పడుతున్నారని బాబు ఆరోపించారు. అయ్యన్నపాత్రుడు సరైన ప్రశ్నలు అడిగారని, ఆయన అడిగిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సరైన సమాధానం ఇచ్చే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేరన్నారు. ఇంటి గోడలు కూల్చివేతకు పాల్పడినంతమాత్రాన బెదిరేది లేదని, అయ్యన్నకు తెలుగుదేశం పార్టీ మొత్తం అండగా ఉంటుందన్నారు.

నర్సీపట్నంలో పంటకాల్వను ఆక్రమించి నిర్మించారంటూ అర్థరాత్రి సమయంలో అయ్యన్నపాత్రుడి ఇంటి గోడను నర్సీపట్నం పురపాలక శాఖ అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి చెందిన భూమిలో రెండు సెంట్లు ఆక్రమించారంటూ కమిషనర్ పేరుతో ఇచ్చిన నోటీసులో పేర్కొన్నారు. ఈ విషయమై అయ్యన్నసతీమణి పద్మావతి, కుమారులు విజయ్, రాజేశ్ పోలీసులు, మున్సిపల్ సిబ్బంది తీరుపై నిప్పులు చెరిగారు. ఇంటిని సక్రమంగానే నిర్మించినప్పటికీ కావాలనే గోడను కూల్చేశారని, ఇది ముమ్మాటికీ కక్ష సాధింపేనన్నారు.












Click it and Unblock the Notifications