కుప్పంపై చంద్రబాబు మరో కీలక నిర్ణయం..!
ఏపీలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పాటు వైసీపీకి కూడా చాలా కీలకంగా మారబోతున్న నియోజకవర్గం కుప్పం. విపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు వరుసగా ఏడుసార్లు గెలిచిన కుప్పంలో ఈసారి ఎలాగైనా పాగా వేయాలని వైసీపీ ప్రయత్నిస్తుండగా.. టీడీపీ కూడా ఈసారి లక్ష మెజారిటీ సాధించి వైసీపీకి గట్టిగా బదులివ్వాలని వ్యూహాలు సిద్దం చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఇరు పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నాయి. ఇదే క్రమంలో చంద్రబాబు ఇవాళ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
వరుసగా ఏడుసార్లు గెలిచినా గెలుపు కోసం పెద్దగా శ్రమించని కుప్పంలో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా లక్ష మెజారిటీ సాధించి తన పట్టు నిరూపించుకోవాలని భావిస్తున్న చంద్రబాబు.. ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం ప్రకటించారు. కుప్పం నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా రెండు పార్టీ కమిటీల్ని నియమించారు. ఇందులో ఒకటి టీడీపీ విస్తరణ విభాగం కాగా మరొకటి కార్యకర్తల సంక్షేమ విభాగం. ఈ రెండూ టీడీపీ కోణంలో చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ కార్యకర్తల్ని బెదరగొట్టి వైసీపీలోకి ఆకర్షించే ప్రయత్నాలు సాగుతున్న వేళ చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్న బీఆర్ సురేష్ బాబును దీంతో పాటు కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం కన్వీనర్ గా కూడా నియమించారు. అలాగే డీఎస్ త్రిలోక్ ను కుప్పం నియోజకవర్గం పార్టీ కార్యకర్తల సంక్షేమ విభాగం కన్వీనర్ గా నియమించారు. అలాగే కుప్పం మండలానికి చెందిన పార్టీ నేత మణిని రాష్ట్ర తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమించారు. మరోవైపు రామకుప్పం మండలానికి చెందిన డాక్టర్ గిరిబాబు నాయక్ ను ఐటీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అలాగే కుప్పంలో టీడీపీ విస్తరణ విభాగం, కార్యకర్తల సంక్షేమ విభాగంలో 9 మంది చొప్పున సభ్యుల్ని కూడా నియమిస్తూ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇవాళ ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ విస్తరణ విభాగం పార్టీలో కొత్తగా చేరే వారిని ఆహ్వానించి చేరికలు చూస్తుంది. అలాగే కార్యకర్తల విభాగం పార్టీలో కార్యకర్తల్ని కాపాడుకోవడంతో పాటు వారి బాగోగులు చూసేలా పనిచేస్తుంది. దీంతో ఈ రెండు విభాగాలు కూడా వచ్చే ఎన్నికల వరకూ చంద్రబాబుకు అత్యంత కీలకం కాబోతున్నాయి.












Click it and Unblock the Notifications