'దుప్పటి మడతపెట్టి' వచ్చిన టీడీపీ సీనియర్లు!
బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు ప్రజలనుంచి అనూహ్య స్పందన వ్యక్తమవడంతో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేస్తున్నట్లు వైఎస్సార్ సీపీ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అధినేతతో ఆయన సంప్రదించే ఈ ప్రకటన చేశారా? లేదా? అనే విషయంలో తెలుగు తమ్ముళ్ల వద్ద స్పష్టత లేదు. టీడీపీలో ఉన్న సీనియర్ నేతలు ఇటీవలి కాలం నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ టికెట్ల కోసం పోటీపడుతున్నారు. మొదటి నుంచి ప్రజలతో మమేకమవ్వాలని అధినేత ఎంత చెప్పినప్పటికీ వినకుండా ఆ మాటలను పెడచెవిన పెట్టి నిద్రపోయారని కార్యకర్తలు మండిపడుతుంటారు. ఎన్నికల ఏడాది సమయంలో పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరికి పోటీగా యువ నేతలు సైతం తెరపైకి వస్తున్నారు. సీనియర్ నేతలు, యువ నేతల మధ్య టికెట్ల కోసం టీడీపీలో హోరాహోరీ పోరు నెలకొంది. వచ్చే ఎన్నికల్లో 40 శాతం టికెట్లు యువతకు కేటాయించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు.

టీడీపీలో పెరిగిన జోష్ !
బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ కార్యక్రమాలకు ప్రజలనుంచి అనూహ్య స్పందన వ్యక్తమవడంతో తెలుగుదేశం పార్టీ ఫుల్ జోష్ లో కనిపిస్తోంది. నాయకులంతా కేసుల భయాన్ని వదిలిపెట్టి రోడ్లమీదకు వస్తున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో టికెట్ల కోసం తమవంతు ప్రయత్నాలు తాము చేస్తున్నారు. పార్టీలో టికెట్లు ఆశించేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.

158 నియోజకవర్గాల సమీక్షలు పూర్తి
మొత్తం 175 నియోజకవర్గాలకు గాను 158 నియోజకవర్గాల సమీక్షను పార్టీ అధినేత చంద్రబాబు పూర్తిచేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు చేశారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇన్ ఛార్జిలను పనిచేసుకోమని చెబుతున్నారు. మరికొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఏ విషయం తేల్చకుండా పెండింగ్ లో పెట్టారు. తాను చేయించుకున్న సర్వే ప్రకారం గెలుపు గుర్రాలు అనుకున్నవారినే ఇన్ ఛార్జిలుగా నియమించారు. పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చేందుకు మరోవైపు నారా లోకేష్ 4వే కిలోమీటర్ల పాదయాత్ర జరుపుతున్నారు.

పార్టీకి సానుకూల పవనాలున్నాయని..
రాష్ట్రవ్యాప్తంగా పార్టీపై సానుకూల పవనాలు వీస్తున్నట్లు టీడీపీ భావిస్తోంది. దీంతో నాయకులు కూడా టికెట్ల కోసం క్యూ కడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలోను ఒకరికిమించి నాయకులు పోటీపడుతున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో అయితే నలుగురు అభ్యర్థులు పోటీపడుతున్నారు. నిరంతరం ప్రజలమధ్యే ఉండాలని అధినేత చెబుతున్న మాటలకు తలూపుతూ అధిష్టానం దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతున్నారు.ఇప్పటివరకు పార్టీకి దూరంగా ఉన్న నేతలు కొందరు తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కొందరు యువనేతలు తమ నియోజకవర్గాల్లో బలమైన ప్రభావాన్ని చూపుతున్నారు. కేసులకు, దాడులకు బెదరకుండా అధికార పక్షానికి ధీటైన జవాబిస్తున్నారు. ఇటువంటి తరుణంలో నియోజకవర్గాల్లో పోటీచేసే అవకాశం ఎవరికి వస్తుందా? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.












Click it and Unblock the Notifications