చంద్రబాబు నివాసంవద్ద కార్యకర్తల హంగామా, హెచ్చరిక
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసం వద్ద ఆ పార్టీ కార్యకర్తలు ఆదివారం హల్ చల్ సృష్టించారు. విజయవాడ సెంట్రల్ సీటును పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి కేటాయించవద్దని వారు డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో హైదరాబాదులోని చంద్రబాబు నివాసం వద్ద కొంత ఉద్రిక్తత ఏర్పడింది.
తమకు పోటీ చేసే హక్కు ఉందని, త్యాగానికి కూడా హద్దు ఉంటుందని కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శించారు. విజయవాడ సెంట్రల్‌లో టిడిపికి మంచి క్యాడర్ ఉందని, బిజెపికి మాత్రం లేదని వారు చెబుతున్నారు. విజయవాడ సెంట్రల్‌ను బిజెపికి కేటాయిస్తే.. ఆ ప్రభావం మరో మూడు సీట్లపై పడి ఓడిపోతామని వారు హెచ్చరించారు.

కాగా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శనివారం అర్ధరాత్రి రెండున్నర గంటల వరకు జరిగిన చర్చలు సఫలమయ్యాయి. తెలంగాణలో బిజెపికి 47 అసెంబ్లీ, 8 లోకసభ, సీమాంధ్రలో 15 ఆసెంబ్లీ, 5 లోకసభ స్థానాలను ఇచ్చేందుకు తెలుగుదేశం పార్టీ సుముఖత తెలిపింది. బిజెపి కూడా పొత్తు లెక్కకు సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.
అర్ధరాత్రి దాకా టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ ఎడతెగని చర్చలు జరిపారు. అనంతరం ఇరు పార్టీలు అంగీకారానికి వచ్చాయి. తొలిదశ ఎన్నికలకు సమబంధించి ఇరు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications