రాజీనామాలపై వైసీపీ సీరియస్
Vijayasai Reddy: అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పే నాయకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అనేక జిల్లాల్లో ఆ పార్టీని ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. సీనియర్లు సైతం పార్టీని వీడటానికి వెనుకాడట్లేదు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వరుస కట్టి రాజీనామాలు చేస్తోన్నారు. బయటికెళ్తోన్నారు.
మాజీ శాసన సభ్యుడు పెండెం దొరబాబు, ఎమ్మెల్సీలు పోతుల సునీత, బల్లి కళ్యాణ్ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేశారు. అంతకుముందు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణ వైసీపీని వీడారు. ఇటీవలే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులు రెడ్డి సైతం గుడ్‌బై చెప్పారు.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ విప్ సామినేని ఉదయభాను కూడా ఈ జాబితాలో ఉన్నారు. బాలినేని శ్రీనివాసులు రెడ్డి, ఉదయభాను జనసేనలో చేరడానికి వారిద్దరూ రంగం సిద్ధం చేసుకున్నారు. బాలినేని ఇదివరకే ఆ పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తోనూ భేటీ అయ్యారు.
ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మరో మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య కూడా జనసేనలో చేరడం ఖాయమైంది. దీనిపై ఇప్పటికే పవన్ కల్యాణ్‌తో సంప్రదింపులు పూర్తయ్యాయి. ఆయనతో పాటు మరికొందరు నాయకులు జనసేనలో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
తాజాగా రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కూడా పార్టీని వీడారు. ఆయన రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ జగ్‌దీప్ ధన్‌కర్ ఆమోదించారు. తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించడానికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చనే ప్రచారం జరుగుతోంది.
ఈ పరిణామాలపై వైసీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ విజయసాయి రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలుగుదేశం మరోసారి తమ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతోందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తోందంటూ మండిపడ్డారు. 2014 తరహాలోనే ఇప్పుడు కూడా తమ పార్టీ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications