వ్యూహ ప్రతివ్యూహాల్లో పవన్ కల్యాణ్
వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ లోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, జనసేన పనిచేస్తున్నాయి. రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి జగన్ శతథా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు తెలుగుదేశం జనసేనతో పొత్తుపెట్టుకొని బరిలోకి దిగడం దాదాపుగా ఖరారవుతున్నట్లుగానే ఉంది. అధికారం దక్కించుకోలేకపోతే తర్వాత పరిస్థితి ఏమిటనేది ఇరువైపులా నేతలు అవగాహనతోనే ఉన్నారు. దీంతో ఎవరికి వారుగా వ్యూహాలు రచిస్తున్నారు.

వ్యతిరేక ఓటును చీలనివ్వకుండా..
2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేయడంవల్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఊహించని స్థాయిలో లాభపడింది. ఈ విషయాన్ని గమనించిన జనసేనాని రానున్న ఎన్నికల్లో పొత్తుకైనా సిద్ధమేనని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును మాత్రం చీలనివ్వనని పార్టీ ఆవిర్భావసభలో ప్రకటించారు. అప్పటి నుంచి టీడీపీ, జనసేన మధ్య పొత్తు పొడుస్తోందంటూ వార్తలు వచ్చాయి. గత ఐదురోజులుగా విశాఖపట్నం కేంద్రంగా, పవన్ కల్యాణ్ కేంద్రంగా జరిగిన పరిణామాలు, ఆ తర్వాత చంద్రబాబు స్వయంగా పవన్ ను కలిసి సంఘీభావం తెలియజేయడంలాంటి సంఘటనలు తోడు అవసరాన్ని చాటిచెప్పాయి.

బలమైన అండ ఉండాలని..
ఓట్లు చీలిపోవడంవల్లే నష్టపోయామనే అవగాహనతో ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి పోటీచేయడం దాదాపు ఖాయమైంది. అధికారిక ప్రకటనే తరువాయి. విశాఖ సంఘటన జరగనంతవరకు, అంతకు కొద్దిరోజుల క్రితం వరకు పవన్ ఒంటరిగానే పోటీచేయడానికే మొగ్గుచూపారు. అయితే పార్టీ తరఫున ఏ కార్యక్రమం తలపెట్టినా, తాను ఎక్కడికి వెళ్లినా వైసీపీ నేతలు అడ్డుకోవడంతోపాటు కార్యక్రమాల నిర్వహణకు కూడా అడ్డంకులేర్పడుతున్నాయి. దీంతో ఒంటరిగా పోటీచేయాలనుకున్నప్పటికీ తనకు బలమైన రాజకీయ పార్టీ అండగా ఉండాలని భావించారు.

పరిణామాలను అనుకూలంగా మార్చుకున్న పవన్
అందుకనుగుణంగా చోటుచేసుకున్న పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకున్నారు. 175 నియోజకవర్గాల్లోను వైసీపీ బలంగా ఉండటంతో ఏ నియోజకవర్గానికి వెళ్లినా, ఏ ప్రాంతానికి వెళ్లినా అడ్డంకులు తప్పవనే అభిప్రాయానికి పవన్ వచ్చారు. జెండా మోయాలన్నా, గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు సాధించి అసెంబ్లీలోకి అడుగుపెట్టాలన్నా, అందులోను ముఖ్యంగా తాను అసెంబ్లీలో ఉండాలన్నా, బలమైన మిత్రపక్షం అవసరాన్ని పవన్ గుర్తించారు. బీజేపీతో స్నేహం ఉన్నప్పటికీ తాను మొదటి నుంచి అధికార పార్టీపై చేస్తున్న పోరాటంలో ఆ పార్టీ నేతలెవరూ కలిసి రాకపోవడం, రోడ్ మ్యాప్ ఇస్తానన్న ఢిల్లీ పెద్దలు అలసత్వం ప్రదర్శించడంలాంటివన్నీ పవన్ ను పునరాలోచనలో పడేశాయి. దీంతో అందివచ్చిన పరిణామాలను అనుకూలంగా మార్చుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జనసేన శ్రేణుల్లో ఎక్కడా వ్యతిరేకత వ్యక్తం కాకుండా చూసుకున్నారు. దాని ప్రభావం చంద్రబాబు పల్నాడు టూర్ లో కనిపించింది. టీడీపీ జెండాలు, జనసేన జెండాలు కలిసికట్టుగా ఎగిరాయి.












Click it and Unblock the Notifications