బాలయ్య vs జగన్, ఎవరి సత్తా ఏమిటో తేలిపోతుంది, రిసార్టు ఎఫెక్ట్
ఆంధ్రప్రదేశ్ లోని హాట్ నియోజకవర్గాలలో ఒకటైన హిందూపురం నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ఆర్ సీపీకి షాక్ ఇచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన హిందూపురం వైసీపీ కౌన్సిలర్లు ఇప్పుడు మళ్లీ సొంత గూటికి వెళ్లిపోవడంతో హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు.
వైసీపీ కౌన్సిలర్లు ఎందుకు తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, ఇప్పుడు మళ్లీ ఎందుకు సొంత గూటికి వెళ్లిపోయారు అని పూర్తి సమాచారం ఇవ్వాలని ఆయన సన్నిహితులకు సూచించారని తెలిసింది. ఇదే సమయంలో హిందూపురం వైసీపీ కౌన్సిలర్లను కార్యాలయాన్ని పిలిపించుకున్న మాజీ సీఎం జగన్ వారితో చర్చలు జరిపారు. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకోవడానికి తెలుగుదేశం, వైసీపీ నాయకులు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని వెలుగు చూసింది.

ఐదు సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. మూడున్నర సంవత్సరాల క్రితం అధికారంలో ఉన్న వైసీపీ హిందూపురం మున్సిపాలిటీలోని 38 స్థానాల్లో పోటీ చేసి 30 స్థానాలు దక్కించుకుంది. తెలుగుదేశం 6 చోట్ల, బీజేపీ ఒక చోట, ఎంఐఎం ఒక చోట గెలుపొందింది. మెజారిటీ కౌన్సిలర్లు వైయస్సార్ పార్టీ కౌన్సిలర్లు ఉండటంతో ఆ పార్టీకి చెందిన ఇంద్రజ హిందూపురం మున్సిపల్ చైర్మన్ అయ్యిరు.
అయితే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. వైసీపీకి చెందిన 18 మంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరుతామని ఎమ్మెల్యే బాలకృష్ణ దగ్గరికి వెళ్లారు. అయితే అందర్నీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవడానికి నిరాకరించిన బాలకృష్ణ వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లను మాత్రమే తెలుగుదేశం పార్టీలో చేర్చుకున్నారు. ఇదే సమయంలో హిందూపురం మున్సిపల్ చైర్మన్ ఇంద్రజ వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఆగస్టు 20వ తేదీన మున్సిపల్ చైర్మన్ ఇంద్రజతో పాటు 11 మంది వైసీపీ కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. చైర్మన్ పదవికి ఖాళీ అయ్యి రెండు నెలలు అవుతున్నా హిందూపురం మున్సిపాలిటీ చైర్మన్ పదవికి నోటిఫికేషన్ మాత్రం జారీ కాలేదు. ఇదే సమయంలో రంగంలోకి దిగిన మాజీ సీఎం జగన్ హిందూపురం చెందిన వైసీపీ కౌన్సిలర్లను పిలిపించుకుని మాట్లాడారు. వైసీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషా కిరణ్ నేరుగా వైసీపీ కౌన్సిలర్లతో చర్చలు జరిపించారు. ఈ సమయంలో నలుగురు వైసీపీ కౌన్సిలర్లు తిరిగి సొంత గూటికి రావడానికి అంగీకరించారు.
ఇప్పుడు మెజార్టీ పరంగా చూసుకుంటే వైసీపీ కౌన్సిలర్లు హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవిని దక్కించుకునే అవకాశం ఉంది. హిందూపురం మున్సిపాలిటీ మూడో వార్డు కౌన్సిలర్ లక్ష్మీని చైర్మన్ గా పోటీలో దింపాలని జగన్ సూచించారని తెలిసింది. అయితే లక్ష్మీని చైర్మన్ పదవిలో కూర్చోబెట్టడానికి వైసీపీకి చెందిన చాలామంది కౌన్సిలర్లు వ్యతిరేకిస్తున్నారని తెలిసింది. ప్రతిష్టాత్మకమైన హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ, వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తోంది. ఇదే సమయంలో రిసార్టు రాజకీయాలు చేయడానికి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు సిద్ధమవుతున్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications