2024 ఎన్నికల్లో గెలిస్తే 2029 ఎన్నికల్లో కూడా గెలిచినట్లే!!
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు సాధించేందుకు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం హోరాహోరీగా తలపడుతున్నాయి. రెండోసారి విజయం సాధించేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహ రచన చేస్తుండగా, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రణాళికలు రచిస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కల్యాణ్ దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. కింగ్ మేకర్‌గా ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్నారు.

వాయిదా పడుతున్న పునర్విభజన
దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటూ వస్తోన్న వైసీపీ, టీడీపీలకు 2024 ఎన్నికలు కీలకంగా మారడంతో చెమటోడుస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని హామీ ఇచ్చినప్పటికీ అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్న టీఆర్ఎస్ నియోజకవర్గాల పునర్విభజన కోసం ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ అనుకున్నది సాధించుకోలేకపోయారు.
Recommended Video


స్పష్టతనిచ్చిన కేంద్ర ప్రభుత్వం
నియోజకవర్గాల పునర్విభజనపై పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కేంద్రం స్పష్టతనిచ్చింది. రాజ్యాంగ సవరణ తప్పనిసరి అని, 2026లోనే అది వీలవుతుందని తెలిపింది. దీంతో 2024లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో అదే పార్టీ 2029లో కూడా విజయం సాధించడం సులువవుతుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న పార్టీ తనకు అనుకూలంగా పునర్విభజన చేయించుకునే అవకాశం ఉంటుంది. 2008లో జరిగిన పునర్విభజన కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని మహా కూటమి ఓటమి పాలవడానికి ఇది కూడా ఒక కారణమైంది.

ఏపీలో 50, తెలంగాణలో 34
పునర్విభజన ప్రకారం ఏపీలో 175 నియోజకవర్గాలు 225 అవుతాయి. తెలంగాణలో 119 స్థానాలు 153 అవుతాయి. అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ కనుసన్నల్లోనే ఇవి జరుగుతాయి కాబట్టి సాధ్యమైంతవరకు వాటిపై ఆయా పార్టీల ప్రభావం ఉంటుంది. 2029లో జరిగే ఎన్నికలను సులువుగా ఎదుర్కోవడానికి వీలవుతుంది. టీడీపీ, వైసీపీ 2024 ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడానికి ముఖ్యమైన కారణం ఇదే. అందుకే ఈ రెండు పార్టీలు చావో? రేవో? అన్నట్లుగా తలపడుతున్నాయి. అదృష్టం ఎవరిని వరిస్తుందో మరి.!!












Click it and Unblock the Notifications