మహిళను తన్నిన ఆటోడ్రైవర్ , మహిళా హోం మంత్రి ఉండి ఏం లాభం, జగన్ ఎక్కడ : అనిత ధ్వజం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో మంగళగిరిలో మహిళపై అత్యంత దారుణంగా దాడికి పాల్పడిన ఆటో డ్రైవర్ వ్యవహారంపై ఆమె ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆడబిడ్డకు కష్టమొస్తే గన్ను కంటే జగన్ ముందు వస్తాడని వైసీపీ నేతలు చెబుతున్నారని, ఇక జగన్ ఎక్కడ అంటూ ఆమె ప్రశ్నించారు. మంగళగిరిలో మహిళపై ఆటో డ్రైవర్ దాష్టీకానికి ప్రభుత్వ భద్రతా వైఫల్యమే కారణమని వంగలపూడి అనిత విమర్శించారు.

వైసిపి పాలనలో మహిళలపై 500కు పైగా దాడులు
ఏపీలో అరాచకాలు పెరిగిపోయాయని, మహిళలపై దాడులు నిత్యకృత్యంగా మారాయని అనిత విమర్శలు గుప్పించారు. సీతానగరంలో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ జరిగి రెండు నెలలు కావస్తున్నా నిందితుడిని పట్టుకోలేకపోయారు అని అనిత విమర్శించారు. ప్రభుత్వ చర్యలు నిందితులకు సహకరించేలా ఉన్నాయని ఆరోపణలు గుప్పించిన అనిత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని విరుచుకుపడ్డారు. వైసిపి పాలనలో మహిళలపై 500కు పైగా దాడులు, అఘాయిత్యాలు జరిగాయని అనిత పేర్కొన్నారు.

మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళల రక్షణ శూన్యం
ఇళ్ళల్లో నుండి బయటకు రావాలంటే ఆడపిల్లలు భయపడే పరిస్థితి వచ్చిందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత లేదని స్పష్టం చేశారు. ఇక రాష్ట్రంలో మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ ఏ ఉపయోగం లేకుండా ఉందని పేర్కొన్నారు అనిత. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళల రక్షణ శూన్యంగా మారిందన్నారు. మహిళలపై దాడులు ఈ విధంగా జరుగుతుంటే మంత్రి సుచరిత ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటివరకు మహిళలపై దాడులకు పాల్పడిన వారిని ఎంతమందికి శిక్షపడేలా చేశారని నిలదీశారు. దిశ చట్టం వల్ల ఇప్పటివరకు ఏపీ రాష్ట్రంలో ఒరిగిందేమిటో చెప్పాలన్నారు. దిశ యాప్ వల్ల ఎంత మంది ఆడవారికి రక్షణ లభించిందని ప్రశ్నించారు వంగలపూడి అనిత.

ప్రకటనలపైన తప్పించి మహిళా రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. సొంత పత్రికలో ప్రకటనలపైన తప్పించి మహిళా రక్షణపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో, అప్పు ఇచ్చిన మహిళపై ఆటోడ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. అప్పు ఎప్పుడు చెల్లిస్తామని ప్రశ్నించినందుకు అత్యంత దారుణంగా కాలితో మహిళ ఎగిరిపడేలా ఆటో డ్రైవర్ తన్నాడు. ఇక ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆటోడ్రైవర్ పోకల గోపికృష్ణను మంగళగిరి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Recommended Video

మంగళగిరిలో మహిళపై దాడి ఘటన .. ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు రూరల్ ఎస్ఐ లోకేష్ వెల్లడించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇక మహిళ పై దాడి ఘటన వీడియో తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్న గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ దీనిపై వెంటనే స్పందించాలని పేర్కొన్నారు. మహిళల భద్రతను ప్రధానాంశంగా భావించామని, నిందితుడిని అదుపులోకి తీసుకొని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని ఎస్పీ వెల్లడించారు. మహిళలపై దాడులకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ వ్యవహారాన్ని కూడా అనిత టార్గెట్ చేసి వైసీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications