టీడీపీ-బీజేపీ పొత్తు ప్రకటన అప్పుడే ? చంద్రబాబు పరోక్ష లీకులు-బీజేపీ మౌనంగా గ్రౌండ్ వర్క్ ?
టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు దిశగా పడుతున్న అడుగులపై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్ధాయిలోనూ చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ప్రధాని మోడీ సహా బీజేపీ నేతలపై యుద్దం ప్రకటించి నానా తిట్లు తిట్టిన చంద్రబాబు తిరిగి ఎన్డీయేలోకి ఎంట్రీ ఇస్తున్నారా ? బీజేపీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా ? అనే చర్చ జాతీయ మీడియాలో సైతం సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ రాష్ట్ర కమిటీ భేటీలో చేసిన వ్యాఖ్యలతో ఈ పొత్తు వ్యవహారంలో తొలి అడుగు వేశారా అన్న చర్చ కూడా జరుగుతోంది.

టీడీపీ-బీజేపీ పొత్తు సంకేతాలు
ఒకప్పుడు టీడీపీ-బీజేపీ పొత్తుతో పలుమార్లు ఏపీతో పాటు కేంద్రంలోనూ లబ్ది పొందిన ఇరు పార్టీలు మరోసారి పొత్తు దిశగా అడుగులు వేస్తున్నాయా అన్న చర్చ మొదలైంది. దీనికి ప్రధాన కారణం బీజేపీయే. బీజేపీతో విభేదించి గతంలో ఎన్డీయే నుంచి బయటికి వెళ్లిపోయి ధర్మపోరాటం చేసిన చంద్రబాబను మూడేళ్లకు పైగా దూరం పెట్టిన కాషాయ శిబిరం తాజాగా.. మళ్లీ దువ్వుతోంది.
ప్రధాని మోడీ భీమవరం టూర్ తో మొదలైన వీరిద్దరి ప్రేమ.. అనంతరం చంద్రబాబును ఢిల్లీ పిలిపించే దాకా వచ్చింది. అనంతరం టీడీపీ మనుషుులుగా భావించే జూనియర్ ఎన్టీఆర్, రామోజీరావు వంటి వారితో అమిత్ షా జరిపిన చర్చలు కూడా భవిష్యత్ రాజకీయాలకు సంకేతంగా నిలిచాయి.

చంద్రబాబు తొలి అడుగు
టీడీపీ-బీజేపీ పొత్తు, ఎన్డీయేలోకి దసరాలోపు టీడీపీ రీ ఎంట్రీ ఇవ్వబోతోందన్న ప్రచారం జాతీయ స్దాయిలోనూ సాగుతున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు గందరగోళంలో పడ్డారు. దీంతో చంద్రబాబు ఈ వ్యవహారంలో వరుసగా రెండు రోజులు రెండు సందర్భాల్లో క్లారిటీ ఇచ్చేశారు. అయితే చంద్రబాబు స్పందన చూస్తుంటే బీజేపీతో పొత్తు ఉండబోదని కానీ, చర్చలు జరగలేదని కానీ, జరిగాయని కానీ చెప్పలేదు.
కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం పాటుపడే పార్టీలకే జాతీయ స్ధాయిలో మద్దతు ఇస్తామనే సంకేతాలు ఇచ్చేశారు. దీంతో చంద్రబాబు వ్యాఖ్యలు ఇరుపార్టీల పొత్తు దిశగా తొలి అడుగుగానే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

బీజేపీ బ్యాక్ గ్రౌండ్ వర్క్
తెలంగాణ రాజకీయాల కోసం టీడీపీతో తిరిగి పొత్తు కుదుర్చుకోవాలంటే బీజేపీ చాలా హోం వర్క్ చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా మరోసారి టీడీపీతో ఎందుకు పొత్తు కుదుర్చుకుంటున్నారనే దానిపై జనానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణ ప్రజలకైతే ఆంధ్రా పార్టీగా కేసీఆర్ ముద్ర వేసిన టీడీపీతో పొత్తు ఎందుకనే దానిపై కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.
దీంతో ఈ రెండు ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్, నితిన్ వంటి వారి సాయం తీసుకోవడంపైనా బీజేపీ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయితే అప్పుడు బీజేపీ తదుపరి అడుగు వేసేందుకు అవకాశం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.

అప్పుడే పొత్తు ప్రకటన?
టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదర్చేందుకు తెరవెనుక భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఇరు పార్టీల మధ్య ఉండాల్సిన షరతులపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది పూర్తయ్యేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉంది. అయితే ఎట్టి పరిస్ధితుల్లోనూ కొత్త ఏడాది ఆరంభంలో మాత్రం పొత్తుపై ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్తున్నారు.
ఎలాగో వచ్చే ఏడాది తెలంగాణ ఎన్నికలు ఉంటాయి కాబట్టి దానికి నాలుగు నుంచి ఆరు నెలల లోపు ఈ పొత్తు ప్రకటన చేస్తే ఫలితం ఉంటుందనే అంచనాల్లో ఇరు పార్టీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అప్పటివరకూ బహిరంగ ప్రకటనలు చేసేందుకు ఇరు పార్టీలు సిద్ధంగా లేవు.












Click it and Unblock the Notifications