టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు : సస్పెన్స్ తో ఆశావహులకు చుక్కలు ! వైసీపీ మొగ్గు అక్కడే?
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను కూడగట్టేందుకు ఓపక్కన పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుండగా.. మరోవైపు చంద్రబాబు తన పని తాను చేసుకుంటూనే పరిస్ధితుల్ని బట్టి బీజేపీ-జనసేన కూటమితో జట్టుకట్టేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అయితే బయటికి మాత్రం గుంభనంగా ఉంటున్నారు. ఇది క్షేత్రస్ధాయిలో టికెట్లపై భారీ ఆశలు పెట్టుకున్న ఆశావహుల్ని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. అయినా మరో ఏడాదిపాటు ఇదే పరిస్ధితి కొనసాగే అవకాశం ఉండటంతో ఆ మేరకు వైసీపీ లబ్ది పొందుతున్నట్లు క్షేత్రస్దాయిలో నివేదికలు చెప్తున్నాయి.

ఏపీ విపక్షాల గందరగోళం
ఏపీలో వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలు ఏడాది క్రితమే ఏకమయ్యాయి. గతేడాది అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్ర చేసినప్పుడే విపక్షాల ఐక్యత కనిపించింది. అయితే ఈ ఐక్యత తుదికంటా సాగుతుందో లేదో తెలియని పరిస్దితి. ఓవైపు విపక్షనేత చంద్రబాబును పలు సమావేశాలకు ఆహ్వానిస్తున్న కేంద్రం.. రేపు ఎన్నికలకు ముందు ఆయనతో పొత్తు పెట్టుకుంటుందో లేదో తెలియడం లేదు.
మరోవైపు వైసీపికి వ్యతిరేకంగా విపక్షాలు ఐక్యంగా ఉంటేనే గెలుపుపై ఆశలు పెట్టుకోవచ్చని పవన్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీని ఒప్పించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. అలాగని బీజేపీని వదిలేసి ఇప్పటికిప్పుడు పవన్ టీడీపీతో ముందుకు సాగే అవకాశాల్లేవు. దీంతో ఈ సస్పెన్స్ మరికొంతకాలం కొనసాగే అవకాశముంది.

టికెట్ల ఆశావహులకు చుక్కలు?
ప్రస్తుతానికి రాష్ట్రంలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు ఉంది. టీడీపీతో ఈ రెండు పార్టీలకు పొత్తు లేదు. మరి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు బీజేపీ-జనసేన అభ్యర్దుల్ని ఖరారు చేసుకుంటున్నాయా అంటే అదీ లేదు. దీనికి కారణం ఎన్నికలకు ముందు టీడీపీతో పొత్తు అవసరం ఏర్పడుతుందన్న అనుమానమే. దీంతో బీజేపీ-జనసేనతో పోలిస్తే టీడీపీ పలుచోట్ల కచ్చితంగా పోటీ చేసే అభ్యర్ధుల్ని ఎంచుకుంటోంది. మరికొన్ని చోట్ల ఆశావహులు తమ పేర్లు ప్రకటించకపోవడంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.
జనసేనలో ఆశావహులదీ అదే పరిస్దితి. రేపు టీడీపీతో పొత్తు కుదిరితే ఏ సీట్లు కేటాయిస్తారో తెలియదు. కాబట్టి ఇప్పుడే టికెట్లు ఖరారు చేసుకుంటూ వెళ్తే ఇబ్బందులు తప్పవని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. బీజేపీదీ దాదాపు ఇదే పరిస్దితి. దీంతో ఆయా పార్టీల్లో టికెట్ల ఆశావహులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

వైసీపీ మొగ్గు కనిపిస్తోంది అక్కడే?
విపక్ష పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడం, అలాగని పొత్తుల్లేకుండా విపక్ష పార్టీలు ఒంటరిలో బరిలోకి దిగే అవకాశాలు కూడా లేకపోవడంతో ఆ మేరకు వాటికి నష్టం జరుగుతోంది. జగన్ కు ఎదురుగా విపక్షాన్ని నడిపేది చంద్రబాబే అయినా పవన్ సాయం లేకుండా ఇది కుదరదని తెలిపోయింది.
అలాగే బీజేపీకి సైతం పవన్ లేకుండా ముందుకు సాగలేమని అర్ధమైంది. దీంతో విపక్షాలు టికెట్లపై ఎటూ తేల్చడం లేదు. ఈ పరిస్ధితి వైసీపీకి ప్లస్ గా మారుతోంది. ముఖ్యంగా ఎన్నికలకు ముందు రాష్ట్రంలో రాజకీయం ఎటువైపు మొగ్గుతోందన్న ప్రశ్నకు ఇప్పటికీ వైసీపీవైపే అన్నట్లుగా మారడం వెనుక ఇదో బలమైన కారణంగా కనిపిస్తోంది. తాజా పరిస్ధితులను బట్టి చూస్తే విపక్షాలు ఈ గందరగోళంలో మరికొంతకాలం ఉంటే చాలనే భావనలో వైసీపీ నేతలు కూడా కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications