చంద్రబాబు బీపీ పెంచేస్తున్న జగన్ ? ఆ దూకుడుతో- మారిపోతున్న టీడీపీ వ్యూహాలు, వ్యూహకర్తలు
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగిపోతున్న రాజకీయాలు 2024లో ఎన్నికల నాటికి మరింత వేడి పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ముఖ్యంగా రాజకీయ వ్యూహాలకు తోడు వ్యూహకర్తల్ని నియమించుకుని మరీ 2019 పోరులో చంద్రబాబును వెనక్కి నెట్టిన జగన్.. ఇప్పుడు కొత్త వ్యూహాలు, సంచలన నిర్ణయాలతో దూసుకుపోతుండగా.. ఆ స్పీడుతో చంద్రబాబు సైతం వ్యూహాలు మార్చుకోక తప్పని పరిస్ధితి ఎదురవుతోంది. ఇప్పటికే కొత్త వ్యూహాకర్తను నియమించుకున్న టీడీపీ అధినేత ఇప్పుడు వ్యూహాల్ని కూడా సవరించుకుంటున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

జగన్ వర్సెస్ చంద్రబాబు
జగన్, చంద్రబాబు పోరుకు సుదీర్ఘ చరిత్రే ఉంది. అయితే రాజకీయాల్లో ఏ రోజు ఎత్తు ఆ రోజే అన్నట్లు మారిపోతున్న పరిస్ధితులు. దీంతో జగన్, చంద్రబాబు ఇద్దరూ పైకి కనిపిస్తున్నంత సాఫ్ట్ గా రాజకీయాలు నడిపే పరిస్దితులు ఏమాత్రం కనిపించడం లేదు. ముఖ్యంగా 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం వీరిద్దరూ వేస్తున్న ఎత్తులు, పైఎత్తులు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయస్దాయిలో చర్చనీయాంశమవుతున్నాయి. అదే సమయంలో ఏపీలోనూ వీరిద్దరూ నేతృత్వం వహిస్తున్న వైఎస్సార్సీపీ, టీడీపీలోనూ విస్తృత చర్చకు దారి తీస్తున్నాయి.

పోరు మొదలుపెట్టేసిన జగన్
ఎన్నికలకు ఇంకా రెండేళ్లకు పైగా సమయం ఉన్నా సీఎం జగన్ అప్పుడే పోరు మొదలుపెట్టేశారు. పైకి ప్రవీణ్ ప్రకాష్, గౌతం సవాంగ్ బదిలీల రూపంలో తాజాగా తీసుకున్న రెండు సంచలన నిర్ణయాలు మాత్రమే కనిపిస్తున్నా.. అంతర్గతంగా జగన్ భారీ కసరత్తే చేస్తున్నారు. ఇప్పటికే గతేడాది డిసెంబర్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మార్చి నుంచి జనాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని మంత్రులకు సైతం సంకేతాలు ఇచ్చేశారు. ఈ మార్చిలో అసెంబ్లీ, ఉగాదికి కొత్త జిల్లాలు, జూన్ కల్లా మంత్రివర్గ విస్తరణ పూర్తి చేసి జూలై కల్లా జనంలోకి వెళ్లేందుకు జగన్ కసరత్తు చేసుకుంటున్నారు. దీంతో జగన్ ప్రత్యర్ధులకు అందనంత దూరంలో ఉన్నట్లు కనిపిస్తున్నారు.

చంద్రబాబు బీపీ పెంచేస్తున్న జగన్
జగన్ తాజా నిర్ణయాలు, ఆలోచనలు, వ్యూహాలతో సహజంగానే విపక్ష నేత చంద్రబాబుు బీపీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఘోర పరాజయం తర్వాత విపక్షంలోకి వచ్చి మూడేళ్లు కావస్తోంది. ఈ మూడేళ్లలో టీడీపీ పరిస్ధితి ఏమైనా మెరుగుపడిందా అంటే కచ్చితంగా అవునని చెప్పలేని పరిస్ధితి. ఇక మిగిలింది రెండేళ్లే. అందులోనూ ఏడాది దాటితే ఎన్నికల ఏడాదిలోకి అడుగు పెట్టడం ఖాయం. మరోవైపు జగన్ దూకుడు నానాటికీ పెరిగిపోతోంది. ఆ స్పీడుకు తట్టుకుంటూ వేగంగా ప్రజల్ని ఆకట్టుకోవడం అంత సులువేమీ కాదు. ఇది గమనించే చంద్రబాబు వ్యూహాల్ని, వ్యూహకర్తల్ని సవరించుకునే పనిలో బిజీగా ఉన్నారు.

వ్యూహాలు మార్చేస్తున్న చంద్రబాబు
ఇప్పటికే జగన్ దూకుడుతో ఈ మూడేళ్లలో తాము సాగించిన పోరుకు ఫలితం లేకుండా పోతోంది. ఇక మిగిలిన ఈ రెండేళ్లలోనూ ఏదో ఒక అద్భుతం జరగకపోతే వైసీపీని ఇప్పుడున్న పరిస్దితుల్లో దీటుగా ఎదుర్కోవడం కష్టమే. దీంతో నిత్యం వ్యూహరచనలో చంద్రబాబు మునిగితేలుతున్నారు. తాజాగా రాబిన్ శర్మ స్ధానంలో కొత్త వ్యూహకర్త సునీల్ కానుగోలును తెచ్చుకున్నారు. ఆయన మార్గదర్శకత్వంలో ఇక టీడీపీ నేతల్ని పరుగులు తీయించాల్సి ఉంది. కానీ వైసీపీ దూకుడుతో టీడీపీలో సైతం కిందిస్ధాయి నేతలు, క్యాడర్ లో అలసత్వం పెరిగిపోతోంది. దీంతో తాజాగా మరోసారి యాక్టివ్ గా లేకపోతే సాగనంపుతానంటూ మరోసారి చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. అంతే కాదు రాబోయే రోజుల్లో టీడీపీ కొత్త వ్యూహాల్ని అమలు చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications