సీఎం జగన్ పై బాబు బ్రహ్మాస్త్రం: కానీ, ఆ భయం వెంటాడుతోంది: కేబినెట్ నిర్ణయం రాగానే..!
రాజకీయంగా భవిష్యత్ లో పర్యవసానాలు ఎలా ఉన్నా..అమరావతికి మద్దతుగా నిలవాలని చంద్రబాబు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగా ఇప్పటికే అక్కడి రైతుల ఆందోళనలకు మద్దతు ఇస్తూనే..ప్రత్యక్షం గా ఉద్యమంలో పాల్గొంటున్నారు. ఇక, ఇదే సమయంలో ఆయన ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల దిశగా అడుగులు వేగంగా వేస్తున్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఈ సమయంలో ఉద్యమం కొనసాగిస్తూనే.. రాజకీయంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని భావిస్తున్నారు. ఇందు కోసం కీలక నిర్ణయం దిశగా పార్టీలో అతి ముఖ్యుల వద్ద ఒక ప్రతిపాదన చర్చకు వచ్చింది. ప్రభుత్వం హైపవర్ కమిటీ నివేదిక రాగానే .. మూడు రాజధానుల అంశం మీద కేబినెట్ ఏర్పాటు చేసి అనుకూలంగా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అదే జరిగితే..ఆ వెంటనే తమ నిర్ణయాన్ని ప్రకటించాలని టీడీపీ భావిస్తోంది. ఇదే సమయంలో ఆ నిర్ణయం అమలు చేయాలంటే..కొన్ని సందేహాలు..మరి కొన్ని భయాలు టీడీపీని వెంటాడుతున్నాయి.

సామూహిక రాజీనామాల దిశగా..
మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు కు వ్యతిరేకంగా టీడీపీ కీలక నిర్ణయం దిశగా ఆలోచన చేస్తోంది. ఇప్పటికే అమరావతికి మద్దతుగా ఉద్యమం చేస్తున్న టీడీపీ కొత్త నిర్ణయా ల ద్వారా ప్రజలకు దగ్గర కావాలని భావిస్తోంది. ప్రస్తుతం రాజకీయంగా ఉన్న పరిస్థితులను తమకు అనుకూలంగా మలచుకొనేందుకు కొత్త వ్యూహం పైన కసరత్తు చేస్తోంది. మూడు రాజధానుల పైన ప్రభుత్వం కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని...ఆ తరువాత అసెంబ్లీలో తీర్మానం చేయాలని భావిస్తోంది. అయితే..కేబినెట్ లో అధికారికంగా నిర్ణయం తీసుకున్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా చంద్రబాబుతో సహా ఎమ్మెల్యేల పదవులకు రాజీనామా చేసి..ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని ఆలోచన చేస్తోంది. దీని పైన పార్టీలోని ముఖ్యుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. దీని ద్వారా ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందా..లేక..తమకు రాజకీయంగా కలిసి వస్తుందా అనే కోణంలో చర్చ సాగుతోంది.

వారు కలిసొస్తారా...ఆమోదిస్తే ఏమవుతుంది..
ఇదే సమయంలో..మూకుమ్మడి రాజీనామాల ద్వారా ఈ ప్రతిపాదన వ్యతిరేకిస్తున్న ప్రాంతాల్లో తమకు రాజకీయంగా కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. అమరావతి ప్రాంత జిల్లాలతో పాటుగా సీమ ప్రాంతంలోని దీని పైన వ్యతిరేకత ఉందని టీడీపీ అంచనా. అయితే, టీడీపీ నుండి మొత్తం 23 మంది ఎమ్మెల్యేలు గెలవగా..ఇప్పటికే ఇద్దరు పార్టీకి దూరమయ్యారు. ఇక, పార్టీ ఈ ముకుమ్మడి నిర్ణయం తీసు కుంటే..విశాఖ నుండి గెలిచిన నలుగురు సహకరించే అవకాశాలు తక్కువ. అదే విధంగా శ్రీకాకుళం నుండి ఇద్దరు ఉన్నా..వారు పార్టీతోనే నడిచే అవకాశం ఉంది. దీంతో పాటుగా..తాము రాజీనామాలు చేసిన వెంటనే స్పీకర్ ఆమోదిస్తే ఉప ఎన్నికలు ఎదుర్కోవటానికి సిద్దంగా పార్టీ ఉందా..ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తారా..అధికారంలో ఉన్న పార్టీ పైన పైచేయి సాధించగలమా అనే కోణంలో పార్టీ ముఖ్యులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

అందరి ఆమోదంతోనే మందుకు..
ఈ అంశం పైన పార్టీలో చర్చ జరుగుతన్న మాట వాస్తవమేనని..అయితే, పార్టీలోని అందరి అభిప్రాయాల మేరకు తాము ముందుకు వెళ్తామని టీడీపీ సీనియర్లు చెబుతున్నారు. ప్రజల్లో ఉన్న ఆందోళనను జాతీయ స్థాయిలోనూ తీసుకెళ్లేందుకు ముందుగా కార్యాచరణ సిద్దం చేస్తున్నామని చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో.. టీడీపీ నుండి ఎంత మంది రాజీనామా చేయటానికి సిద్దంగా ఉన్నారు..అమరావతి కోసం రాజీనామా చేస్తే ఉభయ గోదావరి..అనంతలో తిరిగి గెలిచే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు పార్టీలో చర్చ. దీని కోసం ఒక సర్వే చేయిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సంక్రాంతి తరువాత పార్టీ పాలిట్ బ్యూరో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వ అడుగులు.. స్థానిక సంస్థల ఎన్నికలు..రాజధాని విషయంలో కీలక నిర్ణయాల దిశగా చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్న్ విషయం. అయితే, టీడీపీ అనుకున్నట్లుగా పార్టీ ఎమ్మెల్యేలు మొత్తంగా రాజీనామా చేస్తే..ఉప ఎన్నికలు తప్పవనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. దీని పైన సంక్రాంతి తరువాత స్పష్టత వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications