
Chandra Babu: సీఎం జగన్ పై చంద్రబాబు రివర్స్ గేమ్ - ప్రధానే చెప్పారు..!!
Chandra Babu strategy: వచ్చే ఎన్నికల కోసం చంద్రబాబు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. సరి కొత్త నినాదాలు ఎంచుకుంటున్నారు. సీఎం జగన్ గతంలో అమలు చేసిన ఎత్తుగడలను ఇప్పుడు చంద్రబాబు ఆయన పైనే ప్రయోగిస్తున్నారు. అందులో భాగంగా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు ఒక సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారని చేసిన ప్రచారం గుర్తు చేస్తూ..తాజా నియామకాల పైన ప్రశ్నిస్తున్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన తన రికార్డు ఎవరూ టచ్ చేయలేరని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో ఈ ఎన్నికలు తనకు చివరివి కావని..మరోసారి వైసీపీని గెలిపిస్తే ప్రజలకు ఇవే చివరి ఎన్నికలంటూ కొత్త నినాదం మొదలు పెట్టారు.

ఒకే జిల్లా..ఒకే సామాజిక వర్గం
2019 ఎన్నికల సమయంలో పోలీసు శాఖలో జరిగిన పోస్టింగ్ లు..బదిలీలకు సంబంధించి వైసీపీ నాడు టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇప్పుడు చంద్రబాబు సైతం అదే ఫాలో అవుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు ఇదే తరహాలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసారు. ముఖ్యమంత్రి..సీఎస్..డీజీపీ ఇలా అందరూ ఒకే జిల్లా..ఒకే సామాజిక వర్గం అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. మౌనంగా ఉంటే లాభం లేదని.. ప్రజల్లో తిరుగుబాటు రావాలని చంద్రబాబు పిలుపిచ్చారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అపేస్తానంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పరోక్షంగా జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తానని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్ తన సంక్షేమ పథకాల లబ్ది దారుల ఓట్ బ్యాంకు పైనే ఎక్కువగా ఫోకస్ చేసారు. ఇప్పుడు చంద్రబాబు తాను సంక్షేమం అమలు చేస్తానంటూ సభలో హామీ ఇస్తున్నారు.

ప్రధాని మోదీనే చెప్పారంటూ..
చంద్రబాబు తన ప్రసంగంలో మోదీ తనను ప్రశంసించిన అంశాన్ని ప్రస్తావించారు. తాను రూపకల్పన చేసిన డ్వాక్రా గ్రూపులు..టిడ్కో భవనాలకు ప్రధాని మెచ్చుకున్నారని చెప్పుకొచ్చారు. ప్రధాని ప్రశంసలు దక్కించుకున్న తనకు.. జగనన్న కాలనీలకు రూ.1.80 లక్షలు ఇవ్వలేక చేతులెత్తేసిన జగన్‌కు మీరే తేడా చెప్పాలి. జగన్ చేసిన అప్పులకు ఒక్కో మనిషిపై రూ.2.70 లక్షల అప్పు ఉందని చంద్రబాబు తెలిపారు.
ఏపీలో కొందరు పోలీసులు అభిమానం చంపుకొని పనిచేస్తున్నారన్నారు. పోరాడితే విజయం ప్రజలదేనని... పిరికితనంతో ఉంటే బానిసత్వం తప్పదని హెచ్చరించారు. 2024 ఎన్నికలకు సమరశంఖం పూరించాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

చంద్రబాబు కొత్త నినాదం ఓట్లు రాల్చేనా..
టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల్లో కొత్త నినాదంతో ముందుకు వెళ్తున్నారు. ఈ ఎన్నికల్లో గెలిసే సరి..లేకుంటే ఇవే తనకు చివరి ఎన్నికలంటూ చేసిన వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున చర్చ జరిగింది. చంద్రబాబుకు చివరి ఎన్నికలు అయితే రాష్ట్రానికి ఏం నష్టమని వైసీపీ ఎదురు దాడి చేసింది. బీజేపీ నేతలు భిన్నంగా స్పందించారు. దీంతో, ఇప్పుడు చంద్రబాబు రాష్ట్రానికి..ప్రజలకు చివరి ఎన్నికలంటూ తన నినాదం సవరించుకున్నారు. అయితే, ఇదే సమయంలో 2019 ఎన్నికల్లోనే తాను చెబితే వినలేదని..ఇప్పుడు మరోసారి చెబుతున్నానంటూ చంద్రబాబు కొత్తగా ప్రచారం ప్రారంభించారు. అయితే, టీడీపీ గెలవకపోతే ఇక రాష్ట్ర భవిష్యత్ లేదని..ఇవి చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారం ఏ మేర ఓట్లను తెచ్చి పెడుతుందనేది వేచి చూడాలి.