3 రాజధానులు అసాధ్యం- డిసైడైపోయిన చంద్రబాబు ? అమరావతే ఎన్నికల అజెండా !
ఏపీలో మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చిన వైఎస్ జగన్ దానిపై ముందుకూ, వెనక్కి వెళ్లలేని పరిస్దితుల్లో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో రాజకీయాల్లో తన సీనియార్టీని మరోసారి చంద్రబాబు వాడుతున్నట్లు కనిపిస్తోంది. మూడు రాజధానులపై ప్రభుత్వం ఎలాగో ముందుకెళ్లలేదని డిసైడైపోయిన చంద్రబాబు.. మరోసారి అమరావతి అస్త్రంతోనే వచ్చే ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. చంద్రబాబు ముూడు రాజధానులకు వ్యతిరేకమని వైసీపీ బహిరంగంగానే ప్రచారం చేస్తున్నా తాను మాత్రం రూటు మార్చే అవకాశాలు కనిపించడం లేదు.

జగన్ మూడు రాజధానుల వైఫల్యం
ఏపీలోవైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు మూడు రాజధానుల వ్యవహారాన్ని తెరపైకి తెచ్చిన సీఎం వైఎస్ జగన్.. దాన్ని ఓ లాజికల్ ఎండ్ కు తీసుకెళ్లడంలో మాత్రం విఫలమయ్యారు. ఇప్పటికే మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి వచ్చి రెండేళ్లు గడిచిపోవడంతో ఇక మిగిలిన రెండేళ్లలో రాజధానులపై ఆయన ముందుకెళ్లే పరిస్ధితులు కనిపించడం లేదు. ఒక వేళ ముందుకు వెళ్లినా ఇరుక్కుపోవడమే మిగిలుందన్న వాదన కూడా విపక్షాల నుంచి వినిపిస్తోంది. దీంతో ప్రధాన విపక్షమైన టీడీపీ.. ఇప్పుడు మూడు రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతోంది.

పాదయాత్ర సక్సెస్ తో అమరావతికి ఊపు
అమరావతినే రాజధానిగా ఉంచాలని రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతమైంది. న్యాయస్ధానం టూ దేవస్ధానం పేరుతో తుళ్లూరు నుంచి తిరుమల వరకూ రైతులు చేపట్టిన యాత్రకు కోస్తా జిల్లాలో పూర్తిగా, రాయలసీమ జిల్లాల్లో పాక్షికంగా మద్దతు లభించింది. అయితే అమరావతి రాజధానిని ప్రత్యేకంగా వ్యతిరేకించే పరిస్ధితులు లేకపోవడంతో దీనికి అడ్డులేకుండా పోయింది. ఇదే అదనుగా రైతులు విజయవంతంగా యాత్రను పూర్తి చేసుకున్నారు.ఇప్పుడు తిరుపతిలో బహిరంగసభకు సిద్ధమయ్యారు. అదీ విజయవంతమైతే ఇక అమరావతి అజెండాకు కొత్త ఊపు రావడం ఖాయంగా కనిపిస్తోంది.

మూడు రాజధానులపై నీలినీడలు
మూడు రాజధానుల విషయంలో ఎంత స్పీడుగా మొదలుపెట్టారో అంతే స్పీడుగా పూర్తి చేస్తారని భావించిన జగన్ కాస్తా న్యాయవివాదాలు, కేంద్రం అరకొర మద్దతుతో సైలెంట్ అయిపోతున్నారు. తాజాగా రాజధానుల బిల్లుల్ని కూడా అసెంబ్లీలో వెనక్కి తీసేసుకున్నారు. దీంతో మూడు రాజధానులపై నీలి నీడలు కమ్ముకున్నాయి. నిన్న మొన్నటి వరకూ ఏ క్షణమైనా విశాఖకు రాజధాని అంటూ ఊదరగొట్టిన వైసీపీ నేతలకు జగన్ నిర్ణయంతో ఒక్కసారిగా కళ్లు బైర్లు కమ్మాయి.
దీంతో ఇప్పుడు మూడు రాజధానుల మాటెత్తేందుకు వారు జంకుతున్నారు. అంతిమంగా ఇదే టీడీపీ అధినేత చంద్రబాబుకు వరంగా మారుతోంది. దీంతో ప్రస్తుత పరిస్ధితుల్లో మూడు రాజధానులు అసాధ్యమనే నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు... తమ పాత అజెండా అమరావతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు.

అమరావతి అజెండా ఫిక్స్ చేస్తున్న చంద్రబాబు
మూడు రాజధానుల ప్లాన్ విఫలం కావడంతో ఇక అమరావతినే రాజధానిగా చూపిస్తూ ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ దశకు పనులు పూర్తయిన అమరావతిని కాదని విశాఖ, కర్నూలులో రాజధానుల పేరుతో జగన్ ప్రజల్ని మోసం చేస్తున్నారనే అంశాన్ని ఎన్నికల అజెండాగా మార్చుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
ఇప్పటికే అమరావతి రైతుల పాదయాత్ర విజయవంతం కావడంతో అమరావతి రాజధానికి ఇతర ప్రాంతాల్లోనూ మద్దతు లభిస్తోందని గుర్తించిన చంద్రబాబు.. తిరుపతి సభలో తానే నేరుగా పాల్గొనాలని నిర్ణయించారు. దీంతో విపక్ష పార్టీల నేతలు పవన్ కళ్యాణ్, సోము వీర్రాజు వంటి వారు కూడా చంద్రబాబు హవాలో తాము ఫోకస్ కావడం కష్టమేనని భావించి పార్టీలో ఇతర నేతల్ని సభకు పంపుతూ తాము దూరంగా ఉండిపోతున్నారు.

2024 ఎన్నికల అజెండాగా అమరావతి ?
2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా అమరావతిని అజెండాగా మల్చుకోవడంలో విఫలమైన చంద్రబాబు.. ఈసారి మాత్రం జగన్ మూడు రాజధానుల నేపథ్యంలో అమరావతి అజెండాను బలంగా తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2024 ఎన్నికల నాటికి అమరావతి అజెండాను తెరపైకి తెచ్చి రాజధాని లేని రాష్ట్రం అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లబోతున్నారు. రాజధానిగా ఉన్న అమరావతిని తప్పించి మూడు రాజధానులన్న జగన్.. ఇప్పుడు రాజధాని లేకుండా చేశారనే అంశాన్ని ప్రచారం చేయబోతున్నారు. తిరుపతిలో అమరావతి రైతుల సభ తర్వాత అమరావతి అంశాన్ని బలంగా ఫోకస్ చేస్తూ మూడు రాజధానులు భ్రమ, అమరావతే నిజమనే అంశాన్ని జనంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అందుబాటులో ఉండటంతో పాటు భవిష్యత్తులో కేంద్రం నిధులు ఇవ్వకపోయినా అభివృద్ధి చెందేందుకు అమరావతికి అవకాశం ఉందనే అంశాన్ని చంద్రబాబు ఫోకస్ చేయబోతున్నారు. తద్వారా ఇప్పటిదాకా తమ ప్రాంతానికి రాజధాని వస్తుందనే భ్రమలో ఉన్న వారిలో అపోహలు కూడా తొలగించేందుకు సిద్ధమవుతున్నారు.












Click it and Unblock the Notifications